ముంబై కు ఢిల్లీ ధీటైన జవాబు ఇచ్చింది. ఒక్కసారి పుంజుకుంటే తిరిగి తన జైత్రయాత్ర ఆపదు అని పేరున్న ముంబై కు ముకుతాడు వేసింది. చెన్నై వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ పై చేయి సాధించింది. అద్భుతమైన బౌలింగ్తో పటిష్టమైన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీయడంలో ఒక ప్రణాళిక ప్రకారం దేశ రాజధాని టీం ఆడటంతో ముంబై కేవలం 137 రన్స్ మాత్రమే సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఈ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది.
ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తుంది. ఒకరి అవుట్ అయిన తర్వాత మరో భీకరమైన హిట్టర్లు ఆ టీమ్ బలం. మంగళవారం నాటి మ్యాచ్లో మాత్రం ఢిల్లీ బౌలర్ల క్రమశిక్షణాయుత బౌలింగ్ ముందు ముంబై బ్యాట్స్మెన్లు తేలిపోయారు. వచ్చినవారు వచ్చినట్లుగానే అవుట్ కావడంతో పాటు, ఎవరిని భారీ హిట్టింగ్ చేయకుండా నిలువరించడంలో ఢిల్లీ బౌలర్లు విజయం సాధించారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు పేవిలియన్ చేరారు. 86 రన్స్ కే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై టీమ్ ను టైల్ ఏండర్ లు సాయి పడడంతో ముంబై ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు ఇష్టానుసారం బంతులు వేయకుండా, లైన్ అండ్ లెంగ్త్ నమ్ముకొని పద్ధతిగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం ముంబై బ్యాట్స్మెన్ లకు సాధ్యం కాలేదు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా నాలుగు వికెట్లు తీసి ముంబై కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇటీవల వరకూ అతని పక్కన పెట్టిన ఢిల్లీ కు, తాను ఎంత విలువైన బౌలర్ అనేలా అద్భుతమైన ప్రదర్శన చేసి మిశ్రా వచ్చే మ్యాచ్ లలో తన బెర్తును ఖరారు చేసుకున్నాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటింగ్ లోనూ ప్రణాళిక ప్రకారం లక్ష్యం వైపు ముందుకు వెళ్ళింది. అనవసరమైన షాట్లు ఆడకుండా నిలకడ ని నమ్ముకొని ఢిల్లీ బ్యాట్స్ మాన్ మెల్లగా పరుగులు తీశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ లక్ష్యానికి అనువుగా మెల్లగా ఆడుతూ, ఒక్కొక్క పరుగు రా బడుతూ స్కోరును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఆరంజ్ క్యాప్ రేసులో ముందున్న శిఖర్ ధావన్ జట్టు ను గెలిపించేందుకు చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ను ఆడాడు. 15 ఓవర్లలో రాహుల్ చహర్ బౌలింగులో ఒక సిక్స్, మరో ఫోర్ వేసి అద్భుతమైన ఫామ్లో కనిపించిన శిఖర్ ధావన్ అదే ఓవర్లలో లేని షాట్కు ప్రయత్నించి 45 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా వెనువెంటనే అవుట్ అయ్యాడు. దింతో డెత్ ఓవర్లలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించే ముంబై ఇండియన్స్ ఏదైనా అద్భుతం చేయబోతుందా అనిపించింది. అయితే అందుకు అవకాశం ఇవ్వకుండా ఢిల్లీ బ్యాట్స్మెన్ హిట్మేయర్, లలిత్ లు మెల్లగా లక్ష్య సాధన వైపు కదిలాడు. దీంతో చివరి ఓవర్లో 5 రన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరి ఓవర్ కు వచ్చే సరికి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బుమ్రా కు ఓవర్లు అయిపోవడంతో పోలార్డ్ వేసిన చివరి ఓవర్ లో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా నాలుగు బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించి… ముంబై మీద పైచేయి సాధించింది.
బుధవారం శ్రీరామనవమి కావడంతో ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటే, కేవలం ఒక మ్యాచ్ గెలిచి రెండు మ్యాచ్ లు వరుసగా ఓడిపోయిన పంజాబ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో విజయం నమోదు చేసి పెద్ద జట్లకు సవాల్ విసిరారు అని భావిస్తోంది. దీంతోపాటు రెండు మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మొదలు కానుంది. విజయాలతో మంచి ఊపు మీద ఉన్న చెన్నై, అన్నీ ఉన్నా డీలా పడుతున్న కోల్కతా మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.