ఆది సత్తా చాటేనా..?

సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జమ్మలమడుగు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకొని విలవిలాడింది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఫ్యాక్షన్ని వదిలేసి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఏ గొడవలు లేకున్నా ఎన్నికలు జరిగే రోజుల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు ఇప్పటికీ నెలకొంటున్నాయి.

టీడీపీ ఆవిర్భావంతోనే ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. గుండ్లకుంట శివారెడ్డి, దేవగుడి నాయకుల మధ్య గత నాలుగు దశాబ్దాలుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే తమ స్వార్థానికి గత టీడీపీ ప్రభుత్వంలో ఆది నారాయణ రెడ్డి, మాజీ మంత్రి పీ రామ సుబ్బారెడ్డి కలిసి పని చేయడంతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుబ్బారెడ్డిని, ఎంపీగా పోటీ చేసిన ఆదిని ప్రజలు తిరస్కరించారు.

జమ్మలమడుగు ఎమ్మెల్యేగా 2004 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు గెలిచిన ఆది .. గత ఎన్నికల్లో ఓడిపోగానే బీజేపీ లోకి వెళ్లిపోయారు. గత ఏడాదిగా అంటీముట్టనట్లు వ్యవహరించిన ఆయన ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొంతమేర ప్రభావం చూపించారు. నియోజకవర్గ పరిధిలోని 80 పంచాయతీల్లో 25 పంచాయతీల్లో తన వాళ్లని గెలిపించుకున్నారు. పల్లె రాజకీయంపై ఇప్పటికీ ఆది తన పట్టుని నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

Also Read : అన్న అఖిలపక్షం ,తమ్ముడు ఏకపక్షం

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ తన హవా కొనసాగించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఎన్నడూ లేని రీతిలో ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అభ్యర్థించారు. మొత్తం 20 వార్డుల్లో 2 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన18లో వైసీపీ 18, బీజేపీ16, జనసేన 2 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఆది ప్రయత్నాలకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి గండి కొట్టారు. 10 రోజులుగా పట్టణంలోనే ఉంటూ ప్రచార శైలిని పరిశీలించారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో తిరుగుతూ.. అవతలి వర్గానికి ఎలాంటి అవకాశం లేకుండా చేసుకున్నారు. పోలింగ్ కి ముందు వరకు జమ్మలమడుగు మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకుంటామని ప్రచారం చేసుకున్న బీజేపీ నాయకులు .. పోలింగ్ ముగిసిన వెంటనే చల్లగా జారుకున్నారు. మొత్తానికి 18 వార్డుల్లో 4,5 వార్డులను మాత్రమే బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల వల్ల వీలైతే అన్ని వార్డుల్లోనూ వైసీపీనే గెలిచే అవకాశం ఉంది.

అయితే టీడీపీ స్థాపించినప్పటినుంచి జమ్మలమడుగులో ఆ పార్టీకి నాయకత్వం లేకపోవడం ఇదే మొదటిసారి. రామసుబ్బారెడ్డి వైసీపీ ఖండువా కప్పుకోవడంతో మున్సిపాలిటీ లో ఆ పార్టీ కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోలేక పోయింది. ఇక, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చినా ఈ ఎన్నికల్లో ఆయన తటస్థంగా ఉండిపోయారు. తన బావ ఆది బీజేపీ నుంచి అభ్యర్థులను బరిలో నిలపడంతో సూర్యనారాయణ రెడ్డి సైలెంట్ అయ్యారు.

కాగా, బుధవారం జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు పట్టణంలో 34,688 ఓట్లుండగా 26,815 ఓట్లు పోలయ్యాయి. 76 శాతం పోలింగ్ నమోదవడంతో వైసీపీ శ్రేణులు గెలుపు తమదేనని ధీమాగా వున్నారు.

Alao Read : అందరి దృష్టి ఆ రెండు నగరాలపైనే, చివరకు ఏం జరుగుతుంది?

Show comments