iDreamPost
iDreamPost
టాలీవుడ్ మొత్తం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రాజమౌళి మహేష్ బాబు సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కబోతోంది. అలా అని మరీ నెలలు కాదు కానీ కనీసం సంవత్సరం పైగా టైం పట్టడం ఖాయం. హీరో ఎలివేషన్లలో మాస్టర్ డిగ్రీ చేసి మాస్ కి పూనకాలు తెప్పించడంలో పిజి చేసిన జక్కన్న తెరమీద మహేష్ ని ఎలా చూపిస్తాడో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సబ్జెక్టు ఆఫ్రికా అడవుల్లో కూడా సాగుతుందని చెప్పినట్టుగా వినిపిస్తున్న వార్త విని అభిమానులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అందులోనూ రాజమౌళి డైరెక్షన్ అంటే వేరే చెప్పాలా.
ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ అసలు రాజమౌళి మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం తన మనసంతా ఆర్ఆర్ఆర్ మీదే ఉంది. ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా పదే పదే వస్తున్న బ్రేకులు సహనానికి పెద్ద పరీక్షగా మారాయి. వీలైనంత వేగంగా దీన్ని పూర్తి చేస్తే తప్ప మహేష్ సినిమా తాలూకు స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టలేరు. నాన్న కథ ఇస్తారు కానీ స్క్రీన్ ప్లే తో సహా డైలాగులన్నీ సెట్ చేసుకోవాల్సింది జక్కన్న టీమే. అందుకే ఎంతలేదన్నా దానికి ఏడాదికి పైగా టైం పట్టే ఛాన్స్ ఉంది. మహేష్ సర్కారు వారి పాట అయ్యాక ఎవరితో కమిట్ అయ్యాడో ఇంకా స్పష్టత రావడం లేదు.
ఒకవేళ రాజమౌళికే కమిట్ అయితే చాలా సమయం త్యాగం చేయాల్సి ఉంటుంది. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంత కాలాన్ని పణంగా పెట్టారో మహేష్ కు తెలియంది కాదు. కానీ మార్కెట్ లెక్కల్లో చూసుకుంటే ఒకే సినిమాను లేట్ గా చేయడం వల్ల వచ్చే ఆదాయం మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకే మహేష్ ప్లానింగ్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా రెండు వేవ్స్ వల్ల ఇప్పటికే సర్కారు వారి పాటతో పాటు ఇతర చర్చలు ఫైనలైజేషన్లు అన్నీ పెండింగ్ లో ఉండిపోయాయి. సో రాజమౌళి ఆర్ఆర్ఆర్ తరువాత ఎంత బ్రేక్ తీసుకుంటాడు మహేష్ మూవీకి ఎంత టైం ప్లాన్ చేశాడు అనేది ఇక్కడ కీలకంగా మారనుంది.