సరిహద్దు విషయంలో ట్రంప్ మాటలను తోసిపుచ్చిన భారత్

భారత్-చైనా సరిహద్దు విషయమై తాను మోడీతో మాట్లాడానని..ఆయన అసంతృప్తిగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత్ ఖండించింది. ఈ అంశంపై వారిద్దరూ అసలు మాట్లాడలేదని భారత్ స్పష్టం చేసింది. ఏప్రిల్ తరువాత ఇప్పటి వరకు ట్రంప్, మోడీ మాట్లాడుకోలేదని పేర్కొంది.

మరోవైపు సరిహద్దు అంశంపై భారత్-చైనాలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించిన ట్రంప్ కు రెండు దేశాల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. ట్రంప్ ఆఫర్ ను తిరస్కరించాయి.

భారత్‌-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను ప్రధాని మోడీతో మాట్లాడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. చైనా తీరుపై మోడీ అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌-చైనా మధ్య ‘పెద్ద ఘర్షణ’ తలెత్తినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

‘‘భారత్‌-చైనా మధ్య పెద్ద ఘర్షణ తలెత్తింది. రెండూ చెరో 1.4 బిలియన్‌ జనాభా కలిగిన దేశాలు. అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు చైనాగానీ, అటు భారత్‌గానీ తాజా పరిస్థితులపై సంతోషంగా లేవనుకుంటా’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ వివాదంలో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్‌ తేల్చిచెప్పినప్పటికీ.. ఇరు దేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి చైనాతో చర్చిస్తున్నట్లు భారత్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో దేశ భద్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని విదేశాంగ శాఖ తెలిపింది. పరోక్షంగా ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది.

మరోవైపు చైనా సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని చైనా తిరస్కరించింది. మా ఇరు దేశాలు చర్చించుకుంటున్నాయని పేర్కొంది. మా రెండు దేశాల మధ్య ఇంకొకరి జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది.

అయితే ట్రంప్, మోడీ సరిహద్దు అంశంపై మాట్లాడలేదని భారత్ స్పష్టం చేసింది. వారిద్దర మధ్య చివరి సంభాషణ ఏప్రిల్ 4న జరిగిందని, అది కూడా హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్స్ కోసమని భారత్ తెలిపింది. ఇటీవలి వారిద్దర మధ్య సంభాషణలు జరగలేదని తేల్చి చెప్పింది.

Show comments