iDreamPost
android-app
ios-app

మనం మరచిపోతున్న మహానేత.. శాస్త్రీజీ

  • Published Jan 11, 2022 | 11:46 AM Updated Updated Jan 11, 2022 | 11:46 AM
మనం మరచిపోతున్న మహానేత.. శాస్త్రీజీ

1966 జనవరి 10.. తాష్కెంటులో భారత్ – పాక్ మధ్య శాంతి ఒప్పందం. భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు. మరుసటి రోజే.. జనవరి 11న మధ్యాహ్నం 1.32 గంటలకు గుండెపోటుతో శాస్త్రీజీ కన్నుమూశారు అన్న వార్త యావత్తు దేశాన్ని విషాదంలో నింపింది. ఏడాదిన్నర కాలమే ప్రధానిగా పనిచేసినప్పటికీ హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటి పథకాలతో
దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన సమర్థుడాయన. అచంచలమైన దేశభక్తి, నిబద్ధత, నిరాడంబరతకు నిలువుటద్దంలా నిలిచిన శాస్త్రిని గాంధీ, నెహ్రూ కుటుంబ నేతలకు ఇస్తున్నంత గౌరవాన్ని మన ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే శాస్త్రి సేవలను మనం మరిచిపోతున్నాం.

అలుపెరుగని సమర యోధుడు

1904 అక్టోబర్ రెండో తేదీన మొఘల్ సరాయ్ లో జన్మించిన శాస్త్రి 1926లో కాశీ విద్యాపీఠం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ ల ప్రేరణతో స్వాతంత్ర్య సమరంలోకి దూకారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారి జైలుకు వెళ్లారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మరోసారి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 1942లో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన్ను బ్రిటీష్ పాలకులు మళ్లీ జైలుకు పంపారు. 1946 వరకు శాస్త్రి జైలు జీవితం గడిపారు.

రెండో ప్రధానిగా..

స్వతంత్ర భారతంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో లాల్ బహదూర్ రైల్వే మంత్రి బాధ్యతలు చేపట్టారు. తర్వాత హోమ్, విదేశాంగ శాఖల మంత్రిగానూ పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964 జూన్ 9న భారత రెండో ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పాక్ పై తొలి విజయం సారధి

ప్రధానిగా శాస్త్రి అనేక విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారు. గ్రామీణాభివృద్ధికి దోహదపడే వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధికి హరిత విప్లవం, శ్వేత విప్లవం పథకాలకు శ్రీకారం చుట్టింది ఆయనే. ఇందులో భాగంగానే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి క్షీర విప్లవం తీసుకొచ్చారు. జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదంతో సైన్యం ఆధునికీకరణకు సైతం బాటలు వేశారు. నిగర్వి వినయశీలిగా పేరొందిన శాస్త్రి పాకిస్తాన్ పీచుమణచడంలో మాత్రం అత్యంత కఠినంగా, ధైర్యంగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోనే 1965లో పాకిస్తాన్ తో జరిగిన తొలి యుద్ధంలో భారత్ విజయం సాధించింది. కాల్పుల విరమణకు పాక్ బతిమాలే పరిస్థితి తీసుకువచ్చింది.

హఠాన్మరణంపై అనుమానాలు

1965 యుద్ధం అనంతరం భారత్ – పాక్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి సోవియట్ రష్యాలో భాగంగా ఉన్న తాష్కెంట్ లో 1966 జనవరి 10న ఆ ఒప్పందంపై భారత ప్రధాని శాస్త్రి, పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఆ మరునాడు జనవరి 11న మధ్యాహ్నం గుండెలో నొప్పి వస్తుందన్న శాస్త్రి ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కొద్దిసేపటికే కన్ను మూశారు. మరణానికి అరగంట ముందు వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్న శాస్త్రి అంత హఠాత్తుగా కన్ను మూయడం పలు అనుమానాలకు తావిచ్చింది. స్వయంగా శాస్త్రి కుటుంబ సభ్యులే ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ హస్తం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. శాస్త్రి మరణించి 55 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు.

Also Read : అమెరికాలో మనిషికి పంది గుండెతో మార్పిడి