iDreamPost
android-app
ios-app

హోలీ – ఫాల్గుణోత్సవం

  • Published Mar 09, 2020 | 12:27 PM Updated Updated Mar 09, 2020 | 12:27 PM
హోలీ – ఫాల్గుణోత్సవం

పండుగలు మానవ సంఘాలతోనే పుట్టి వాటితోనే పెరిగి అవి మారినప్పుడు మారుతూ, అవి అంతరించినా వాటి పరిణామ దశలకు సూచకాలగా నిలిచిపొయాయి. ముఖ్యంగా మానవుడు ఋతుపరివర్తనం పరిశీలించి నక్షత్రాలను, గ్రహాలను గమనించి వాటి నుండి నూతన విషయాలని గ్రహించి, గ్రహించిన వాటిని గుర్తు పెట్టుకుని, ఆనందించి ఆరాధించాడు.ఆ ఆనందం ఆరాధన కలగలిసి మానవులకు పండుగలయ్యాయి. ముఖ్యంగా మన పండుగలను ఐదు విధాలుగా విభజించారు. ఋతు పరివర్తన ఫలితాలు, పరంపరాగత వృత్తి, గ్రహ నక్షత్ర జనితాలు, జాతి సంఘ సంస్కృతి సమన్వయ సమ్మేళనాలు, మహా పురుషావిర్భావ సూచకాలు. ఇలా ఐదు భాగాలుగా మన పండుగలు విడదీసినా, ప్రకృతి పరిణామమే చాలా పండుగులలో ప్రతిబింబిస్తుంటుంది. ఇలా ఋతు పరివర్తనలో ఏర్పడిన పండుగలో హోలీ పండుగ కూడా ఒకటిగా చెప్పవచ్చు.

ప్రకృతి దేవి మంచు తెరలు తొలగించుకుంటూ కొత్త అందాలతో సాక్షాత్కరించినప్పుడు భారతీయులు ఆమెకు స్వాగతం పలకడం అనాదిగా వచ్చిన ఆచారం. ఈ ఆచారాన్ని ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రజలందరూ ఆనందంతో జరుపుకునే ఉత్సవం కనుక హోలీ ని ఫాల్గుణోత్సవం అని కూడా అంటారు. పూర్వం వసంత విఘవత్తు ఈనాడే సంభవించడం చేత, వైదిక కాలంలో నూతన వర్షం కూడా ఈనాడే ప్రారంభంకావడం చేత ఈ పండుగని వసంతోత్సవంగా పిలుస్తారు. దీంతోపాటు ఈ పండుగకు మదనోత్సవం, కామదహణం, కాముని పున్నమి, హొలికా పూర్ణిమ, డోలికోత్సవమని వివిధ పేర్లతో భారతదేశం అంతా జరుపుకుంటారు.

ఉత్తర భారత దేశంలో ప్రధానముగా వారి ఆహారం గోధుమలు అవ్వడం చేత, గోధుమ కోతకు వచ్చి నూర్పులు చేసుకునే సమయంలో హో ..హో.. అనే శబ్దముతో కోలాహలంగ ప్రజలు పాల్గొనడంచేత ఈ పండుగకి హోలీ అనే పేరు వచ్చిందని కొందరు అంటారు. ఈ పూర్ణిమ నాడు ప్రతి ఇంటి ముందు ఒక గుంట తవ్వి దానిలో ఆముదపు కొమ్ము నాటి గడ్డి, పిడకలు ఆ గుంట చుట్టు పోగు చేసి హోళికా అనే దేవతను పూజిస్తూ, కాల్చిన బూడిదను, ధూళిని చిమ్ముకుంటారు కనుక ఈ పండుగనే ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధులండి అనే పేరుతో వ్యవహరిస్తారని చెబుతారు. అలాగే గాథా సప్తశతిలో దీనిని ఫగ్గుచ్చణం అని వర్ణించారు. బుద్దుని కాలంలో ఈ పండూగనే బాలనకత్త అన్నారు. వీటి బట్టి ఇది అతి ప్రాచీన కాలం నుండీ భారతదేశంలో జరుపుకుంటున్న పండుగగా చెప్పవచ్చు. తెలుగునేలపై విజయనగర సామ్రాట్టుల కాలంలో ఈ పండుగని గొప్పగా జరిపేవారని మనకి చరిత్ర లో లభ్యమైన కొన్ని ఆధారాలు ద్వారా తెలుస్తుంది.

ఈ ఫాల్గుణోత్సవం భారత దేశంలో ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కోవిధంగా జరుపుకుంటారు. అందరూ కలసి రంగులు, పువ్వులు చల్లుకుంటూ ఆనందాన్ని ప్రకటిస్తూ భగవంతుని పూజిస్తారు. తీపి వస్తువు లను పంచుకుంటారు. ఈ హోలి పండుగలోని అంతరార్థాన్ని గ్రహించి మంచి మార్గంలో పయనించడమే హోలీ పండుగ ఇచ్చే సందేశం.