Idream media
Idream media
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌తో చర్చించనున్నారు.
ఇప్పటికే జీఎన్ రావు, బీసీజీ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించిన సంగతి తెలిసిందే. మూడు సార్లు సమావేశమైన కమిటీ సభ్యులు రెండు నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే నేడు చివరిసారిగా సీఎం వైఎస్ జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ కానుంది.
జీఎన్ రావు, బీసీజీ నివేదికలు.. వీటి పై హైపవర్ కమిటీ ఇచ్చే మార్గదర్శకాలు, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై సమావేశంలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదిక, రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు, వెనుక జరిగిన పరిణామాలను అధికార పార్టీ సభ దృష్టికి తెచ్చే అవకాశం ఉంది.