వర్క్ ఫ్రం హోం చేయండి.. అనవసరంగా బయటకు రావద్దు: పోలీసులు!

దేశ వ్యాప్తంగా జులై నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. పంటలు నీట మునిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. వర్షాల కారణంగా తెలంగాణలో దారుణ పరిస్థితులు చవి చూశారు ప్రజలు. వరుసగా ఐదు రోజుల పాటు వానలు పడటంతో రోడ్లన్నీ సముద్రాన్ని తలపించాయి. కుంభ వృష్టిగా కురిసిన వర్షాలకు జలశయాలు నిండటంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్న సంగతి విదితమే. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు జయశంకర్ భూపాల పల్లి, వరంగల్, నిజామాబాద్ తో సహా పలు జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగిన సంగతి విదితమే. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామ ప్రజలను వరద నీరు ముంచెత్తడంతో సుమారు 11 మంది మృత్యువాత పడిన సంగతి విదితమే. ఇప్పుడిప్పుడే ఆ గ్రామం కోలుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో చిన్నపాటి వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతులో నీళ్లు చేరాయి. దీంతో వాహనదారులకు, రాకపోకలు చేసేవారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్‌లో గత రాత్రి నుండి కుండకు చిల్లు పడినట్లు భారీగా వర్షం పడుతూనే ఉంది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్న పాటి వర్షానికే నగరంలోని రోడ్లు జలశయాలను తలపిస్తున్నాయి. కుంభవృష్టిగా వానలు కురుస్తుండటంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని ఉన్నాతాధికారులకు సూచించారు. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదని, ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవాలని తెలిపారు. మిగిలిన ఉద్యోగులు వర్షాభావ పరిస్థితిని బట్టి బయలు దేరాలని సూచించారు.

Show comments