కరోనా ఎఫెక్ట్ .. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

  • Published - 06:39 AM, Fri - 31 January 20
కరోనా ఎఫెక్ట్ .. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

అంతర్జాతియ సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తీరు, రోజు రోజుకి మరణాల సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించింది. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి పని చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేశం పంపించింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టేడ్రస్ అధోనమ్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండే వ్యవస్థలు త్వరగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వైరస్ ని ఎదుర్కోవడంలో చైనా సమర్థవంతంగానే పని చేస్తుందని, చైనా తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.

ఇతర దేశాలు సైతం ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని చీఫ్ టేడ్రస్ సూచించారు. ఈ వైరస్ వార్తల నేపథ్యంలో వివిధ దేశాల ప్రయాణికులపై విధిస్తున్న ఆంక్షలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు బట్టింది. ఇలాంటి చర్యల వల్ల భాదితులకు సకాలంలో సరైన సహాకారం అందించేందుకు అడ్డంకులు ఏర్పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213 కు చేరింది. మరో 9816 మందికి ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు. వారిలో ఒక్క చైనాలోనే 9692 మంది భాదితులుండగా, హాంకాంగ్ లో 12, మకావ్ లో 7, తైవాన్ లో 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమోరికాలో 8, ఆస్ట్రేలియాలో 9 ఇతర ప్రాంతాల్లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఈ కరోనా వైరస్ కి కేంద్ర బిందువుగా ఉన్న చైనా లోని “హుబెయి” ప్రావిన్స్ లో 204 మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు ప్రకటించారు. భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు ఈ ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించింది.

Show comments