కరోనా అంటే ఈరోజు రేపట్లోనో పోయేది కాదు. భవిష్యత్తులో దీని వల్ల ఎన్నో ఇబ్బందులు, మరెన్నో సవాళ్లు తప్పవు. ఈ భయం ఇప్పుడేప్పుడే తొలగిపోయే అవకాశం లేదని స్పష్టంగా తెలుసు. మరి ప్రజల ఆరోగ్యం గురించి, వారి ప్రాణాలు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పాలకవర్గాలు మాత్రం కరోనా అంటే ఏదో చిన్న విషయం మాదిరి సన్నద్ధం అవుతున్నాయి. శాశ్వత ఊరట చర్యలు ఏ మాత్రం లేవు. అప్పటికప్పుడు ఆసుపత్రులను సిద్ధం చేసి, వైద్యం కోసం పరుగులు పెట్టడం తప్పితే ఒక దేశంగా కరోనా ను ఎదుర్కోవడంలో భారత దేశ పాలకులు విఫలమయ్యారని చెప్పక తప్పదు.
కరోనా నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గం కాదు. విపత్తు దేశం మీద విరుచుకు పడుతున్న సమయంలో సన్నద్ధత కోసం లాక్ డౌన్ పెట్టడం మంచిదే. అయితే ఇప్పుడు విపత్తు మధ్యలో ఉన్న వేళ లాక్ డౌన్ పెట్టడం, కోట్లాది మంది పేదలకు కనీసం తిండి లేకుండా చేయడం సరైన పద్ధతి కాదు అని అనుకున్నా, కరోనా కట్టడికి, వైద్యానికి సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వాలు వెతకడం మానేశాయి.
కరోనా తీవ్రతను ముందే గుర్తించిన చైనా వ్యాధి ప్రబలుతున్న సమయంలోనే అతిపెద్ద ఆస్పత్రులను నిర్మించింది. అత్యవసరంగా సిబ్బందిని వైద్యులను నియమించి, ఆక్సిజన్ లెవెల్స్ను దేశవ్యాప్తంగా పెంచింది. ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో పాటు, అక్కడ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వమే చూసుకుంది. మొదటి వేవ్ లో బయటపడిన లోపాలను రెండో వేవ్ లో సైరా కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఫలితంగానే చైనాలో రెండో వేవ్ కొనసాగిన దాని తీవ్రత ప్రజలకు అంతగా లేకుండా పోయింది.
Also Read : మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందా..? కేంద్రం తాజాగా నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటి..?
భారతదేశంలో మొదటి వేవ్ వచ్చిన సమయంలోనే రెండు వేవ్ కూడా వస్తుంది అనే విషయం ప్రభుత్వాలకు, పాలకులకు తెలుసు. అయితే దానికి తగినట్లుగా సన్నద్ధత మాత్రం లేదు. అతి భారీ ఆసుపత్రులను నిర్మించడం లేదా ఉన్న వనరుల్ని ఆస్పత్రులు గా మార్చడం లాంటివి చేయలేదు. ఆక్సిజన్ విషయంలో తగినంత సన్నద్ధత లేకపోవడమే ఇప్పుడు మరణాలు పెరుగుదలకు కారణం. ద్రవ రూప ఆక్సిజన్ ను తరలరించేందుకు క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా దేశంలో లేవు. సింగపూర్ నుంచి ఆఘమేఘాల పై తీసుకొస్తున్నారు. జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్షిజెన్ ప్లాంట్లకు ఆర్మీ విమానాల ద్వారా తెస్తున్నారు. ఈ విషయంలో మొదటి నుంచే సిద్దమై ఆక్సిజన్ ప్లాంట్ లు కొత్తవి నిర్మించి, ఆయా ప్లాంట్లలో సమృద్ధిగా ఆక్సిజన్నిం పితే చాలా వరకు ప్రాణాలు నిలబడేవి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాణవాయువు సమృద్ధిగా నిల్వ చేసే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే బాగుండేది.
2020 నవంబర్ డిసెంబర్ కాలంలో కరోనా మొదటి వేవ్ తగ్గుముఖం పట్టడంతో పాటు, మరోసారి కరోనా భయం లేదు అనే భావనతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయి. నిపుణులు కరోనా సెకండ్ వేవ్ చాలా బలంగా ఉంటుందని హెచ్చరిస్తున్న, దానికి తగిన సన్నద్ధత మాత్రం లేదు. మొదటి వేవ్ లో రోజుకు 97 వేల కేసులే అధికం. సెకండ్ వేవ్ లో రోజుకు మూడు లక్షలు దాటితే కేసులు వస్తున్నాయి. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే ఉత్తర భారతదేశం మొత్తం కరోనా ధాటికి విలవిలాడుతున్న సమయంలో ఇది ఎంత వరకు వెళ్తుంది అనేది మాత్రం తెలియడం లేదు.
భారత దేశంలో కరోనా కోరలు చాచదానికి మరో ప్రధాన కారణం టీకా పంపిణీ. కరోనా టీకా మీద వచ్చిన అపోహలను ప్రభుత్వాలు గట్టిగా ప్రతిఘటించడం లో విఫలం కావడంతో నే ప్రజలంతా టీకా వేయించుకోవడానికి అనాసక్తి చూపించారు. టీకా వేసుకున్న వారు మృత్యువాత పడుతున్నారు అని ప్రచారం బలంగా జరగడంతో చాలామంది టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా వృద్ధులు సైతం టీకా వేసుకోవడానికి వెళ్ళలేదు. దీంతో అప్పటికే మొదలైన సెకండ్ వేవ్ ప్రజల్ని బలంగా తాకింది. టీకా వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పాల్సిన ప్రభుత్వాలు దాన్ని నెరవేర్చకపోవడం తోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వచ్చే మే నెల మొత్తం సెకండ్ వేవ్ కు చాలా కీలకం. ఈ సమయంలో ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో.. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలనూ ఎలా కాపాడుతాయి అన్నది మాత్రం కీలకమైన అంశమే.
Also Read : తన దాకా వచ్చాక మేల్కొన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభవార్త