iDreamPost
iDreamPost
అనుకున్నంత అయ్యింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతే బులియన్ మార్కె ట్లో బంగారం రేటు ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ. 1,310 పెరిగింది. ఇప్పుడు పది గ్రాముల బంగారం రేటు రూ.52,200. నిన్నటి ధర రూ. 50,890. వెండి ధరకూడా పెరిగింది. రూ.59,000కి చేరింది.
ఈ పెరుగుదల తక్కువే. నిపుణుల అంచనా ప్రకారం రూ.2000మేర పది గ్రాముల బంగారం రేటు పెరగనుంది.
రూపాయి పతనమవుతున్నవేళ, దిగుమతులను అడ్డుకొనేందుకు, కేంద్రం బంగారంపై పన్నును 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది.
బంగారంపై బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీని 7.5 శాతం నుండి 12.5 శాతానికి పెంచామని కేంద్రం జూన్ 30 న గెజిటెడ్ నోటిఫికేషన్‌లో తెలిపింది. గత నెలలో, వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడం, రూపాయి రోజురోజుకు నీరసించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి పెట్రోలియం పన్నుల నుండి తగ్గుతున్న ఆదాయాన్ని భర్తీ చేయడం, ఇక రెండోది కరెంట్ ఖాతా లోటును అదుపులో ఉంచడమని నిపుణులు అంటున్నారు.
బంగారంపై దిగుమతి సుంకం ఎందుకు పెరిగింది?
ప్రధాన కారణం వాణిజ్య లోటు. భారతదేశ వాణిజ్య లోటు యేడాది $6.53 బిలియన్ల నుండి $24.29 బిలియన్లకు పెరిగింది. ఇది ఎక్కువే. ఆర్ధిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో వాణిజ్య లోటు గత ఏడాది $21.82 బిలియన్ల ఉంటే, ఇప్పుడది $44.69 బిలియన్లకు పెరిగింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య పెరిగిన అంతరం, విదేశీ నిధులు మార్కెట్ నుంచి బైటకు వెళ్లిపోతున్న కారణంగా, శుక్రవారం యుఎస్ డాలర్‌తో రూపాయి విలువ రూ.79.12కి పడిపోయింది.
మనకు బంగారమంటే చాలా ఇష్టం. అందుకే చైనా తర్వాత, భారతదేశమే రెండో అతిపెద్ద గోల్డ్ కష్టమర్. అలాగని మన దగ్గర పెద్దగా బంగారు గనుల్లేవు. ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సిందే. మే నెలలో బంగారం దిగుమతులు, గత యేడాదితో పోలిస్తే, దాదాపు తొమ్మిది రెట్లు పెరిగాయి. వీటి విలువ 7.7 బిలియన్ డాలర్లు. ఈ దెబ్బకు వాణిజ్య లోటు పెరిగింది. దీనికితోడు రూపాయి క్షీణత. అందుకే బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు, కేంద్రం బులియన్‌పై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నిన్నటి వరకు గోల్డ్ పై బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, అది 12.5 శాతానికి పెరిగింది. దీనికి 2.5 సెస్ అదనం. అంటే బంగారంపై దిగుమతి పన్ను 15 శాతానికి పెరిగినట్లే. ఈ మొత్తానికి 3శాతం జీఎస్టీ కట్టాలి. అంటే బంగారం రేటు మరింతగా పెరగడం ఖాయమని బులియన్ మార్కెట్ అంచనావేస్తోంది.