చివరి ఫలితం కారు ఖాతాలో

  • Published - 10:57 AM, Wed - 9 December 20
చివరి ఫలితం కారు ఖాతాలో

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి నిరాశనే మిగిల్చాయి. సెంచరీ కొట్టాలని తహతహలాడిని గులాబి దళానికి చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న నలబైకి పైగా స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. దీంతో మెజార్టీ స్థానాలను సాధించుకున్నప్పటికీ మేయర్ పీఠానికి చేరువకాలేక పోయింది టీఆర్ఎస్. ఈ అనూహ్య ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అధికార పార్టీకి కాస్త ఊరట లభించింది. నేరెడ్ మెట్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి డివిజన్ ను తన ఖాతాలో వేసుకొని తన బలాన్ని కాస్త పెంచుకుంది.

గ్రేటర్ ఎన్నికల్లో నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితాలపై నెలకొన్న సందిగ్ధం వీడింది. బ్యాలెట్ మీద స్వస్తిక్ ముద్రతో పాటు ఇతర ముద్రలు ఉన్న వాటిని కూడా లెక్కించాలని హైకోర్టు ఆదేశించడంతో పెండింగ్ లో ఉన్న కౌంటింగ్ ను ఈ రోజు ప్రారంభించారు. భవన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ సెంటర్‌ లో 544 ఓట్ల లెక్కింపు జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. డివిజన్‌లో మొత్తం 25,175వేల ఓట్లు ఉండగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరునడిచింది. రెండో రౌండ్ లో ఆధిక్యంలోకి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి . మీనా ఉపేందర్ రెడ్డి 668 ఓట్లతో విజయాన్ని సాధించారు. స్వస్తిక్ ముద్ర లేని 544 ఓట్లలో 115 ఓట్లు బీజేపీ అభ్యర్థికికి పోలవగా, 429 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యాయి విజయం సాధించారు.

నేరేడ్‌మెట్ విజయంతో టీఆర్ఎస్ కార్పోరేట్ల సంఖ్య 56కి చేరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4న జరిగింది. బ్యాలెట్ పత్రాల మీద స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించాలంటూ కౌంటింగ్ కి కొన్నిగంటల ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ను తప్పుబడుతూ బీజేపీ కోర్టును ఆశ్రయించిందచి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్క్యులర్ ను రద్దు చేసింది.

కాగా… ఈసీ విధుల్లో కోర్టుల జోక్యంపై అభ్యంతరం చెబుతూ ఎస్ఈసీ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్వస్తిక్ గుర్తులతో పాటు ఇతర గుర్తులు ఉన్న ఓట్లపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న నేరేడ్‌మెట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ రోజు పూర్తి చేశారు.

తాజా ఫలితాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ బలం 56కి చేరింది. నేరేడ్‌మెట్ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం పెరిగినప్పటికీ మేయర్ పీఠాన్ని చేరుకునే అవకాశం మాత్రం లేదు. ఈ నేపథ్యంలో 44 సీట్లతో మూడవ స్థానంలో ఉన్న మజ్లిస్ సహకారాన్ని తీసుకోవాలనుకుంటోంది అధికార పార్టీ. మజ్లిస్ ప్రత్యక్ష లేదా పరోక్ష సహకారం ద్వారా మేయర్ పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్న టీఆర్ఎస్ ఆ దిశలో పావులు కదుపుతోంది. మజ్లిస్ తో మొదటి నుంచీ ఉన్న స్నేహబంధం వల్ల అవసరమైతే డిప్యూటీ మేయర్ పదవిని ఆ పార్టీకి ఇవ్వడానికి కూడా టీఆర్ఎస్ సిద్ధమవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఎలాంటి వ్యూహాలతో అధికార పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటోంది చూడాలి మరి.

Show comments