iDreamPost
iDreamPost
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయ వేడి రగిలించిన మినీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైకి దేశ ప్రజల దృష్టి మళ్లింది. నెలన్నర రోజులకుపైగా సుదీర్ఘంగా సాగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 29న ముగిసింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఒక్క అసోంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ అధికారం కాపాడుకోవడంతోపాటు పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలని, దక్షిణ భారతంలో పాగా వేయాలని కొన్నేళ్లుగా తపిస్తున్న కాషాయ పార్టీ.. ప్రస్తుత మినీ సార్వత్రిక ఎన్నికల్లో దాన్ని ఎలాగైనా సాకారం చేసుకోవాలని 2019 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే ప్రణాళికలు వేస్తూ.. పావులు కదుపుతూ వచ్చింది. అందుకోసం ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సహా కేంద్ర పెద్దలంతా ఢిల్లీని వదిలి ఈ రాష్ట్రాల్లో కలియతిరిగారు. అయితే బీజేపీ ఆశలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నీళ్లు చల్లాయి. వాటి అంచనా ప్రకారం అసోంలో మాత్రం బీజేపీ అధికారం కాపాడుకోగలుగుతుంది. పుదుచేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ బెంగాల్లో అధికారం చేపట్టాలన్న తమ అసలు టార్గెట్ ను చేరుకోలేరని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో కమలనాథులు కాస్త డీలా పడ్డారు. అలాగే దక్షిణాదిలో పాగా వేయాలన్న వారి ఆశలు ఈసారి కూడా నెరవేరేలా లేవు.
బెంగాల్లో టగ్ ఆఫ్ వార్
బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ నుంచి లాక్కోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. తృణమూల్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం, కేంద్ర అధికారాల పేరుతో గవర్నర్ ద్వారా పాలనలో ఇబ్బంది పెట్టడం, పార్టీ పెద్దలందరూ రాష్ట్రంలో తరచూ పర్యటిస్తూ ఆరోపణాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా రెండేళ్లుగా మమత సర్కారు, పార్టీలపై ముప్పేట దాడి చేసి, ముప్పుతిప్పలు పెట్టారు. ఇరు పార్టీల మధ్య రగిలిన వివాదాలు, మోడీ-షా ద్వయం 25 సార్లకుపైగా పర్యటించడం వంటి అంశాలు బెంగాల్ ఎన్నికలపై దేశప్రజల్లో ఆసక్తి పెంచాయి. అయితే మమతా ఒంటరిగానే కాషాయ సైన్యంపై విరుచుకుపడి తుది వరకు ఢీ అంటే ఢీ అన్నారు. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తపించారు. దాంతో బెంగాల్ ఎన్నికల యుద్ధం మిగతా ఎన్నికలన్నీ ఒకెత్తు.. అదొక్కటే ఒక ఎత్తు అన్నట్లు సాగింది. గెలుపుపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా ఎగ్జిట్ పోల్స్ లో అధిక శాతం మమత వైపే మొగ్గు చూపాయి. 294 సీట్లున్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 211 స్థానాలు సాధించిన టీఎంసీ ఈసారి భారీ విజయం కాకపోయినా 152 నుంచి 164 వరకు గెలుచుకొని సాధారణ మెజారిటీతో గట్టెక్కుతుందని పలు సర్వేలు అంచనా వేశాయి. అధికారమనే లక్ష్యానికి కాస్తంత దూరంలోనే బీజేపీ బోల్తాపడనున్నట్లు స్పష్టం చేశాయి.
Also Read : బెంగాల్ యుద్ధం ముగిసింది! ఫలితాలపైనే ఆసక్తి
అసోంలో మళ్లీ అధికారం
ఈశాన్య భారతంలో పెద్ద రాష్ట్రమైన అసోంలో 2016 ఎన్నికల్లో తొలిసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి దాన్ని కాపాడుకుంటోంది. గత ఐదేళ్లలో అనేక అవరోధాలు ఎదురై ప్రజావ్యతిరేకత పెరిగినా.. దిద్దుబాటు చర్యలతో అధికారం చేజారకుండా జాగ్రత్తపడినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా తెలుస్తోంది. అధికారం కాపాడుకోవడానికి చివరికి సిట్టింగ్ సీఎం ను కాదని కొత్త అభ్యర్థిని కూడా తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం సర్బానంద సోనేవాల్ అసోం ముఖ్యమంత్రిగా ఉండగా.. హిమంత్ బిశ్వ శర్మను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం అమలు అంశాన్ని తన ఎన్నికల అజెండా నుంచి పూర్తిగా తొలగించింది. 126 స్థానాలున్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 86 సీట్లు సాధించిన బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 75 నుంచి 85 స్థానాలు గెలుచుకోవచ్చని అంచనా. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో.
దక్షిణాదిలో మళ్లీ ఆశాభంగం
ఉత్తర భారతదేశంలో ప్రభల శక్తిగా ఉన్న కమలదళం.. దక్షిణాదిలోను ఎదగాలని చాలా ఏళ్లుగా ఆశపడుతోంది. ఆ ఆశ ఈసారి కూడా నెరవేరే అవకాశం లేనట్లేనని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. 234 సీట్లున్న తమిళనాడులో అధికారంలో భాగస్వామి కావాలన్న లక్ష్యంతోనే అధికార అన్నాడీఎంకేతో బీజేపీ జత కట్టింది. బీజేపీ ఆసలెలా ఉన్నా.. దానితో జత కట్టడమే అన్నాడీఎంకే పాలిట శాపంగా మారబోతోంది. అధికారం చేజారిపోతోంది. జయలలిత, కారుణానిధిలు లేకుండా తమిళనాట జరిగిన తొలి ఎన్నికల్లో అధికార కూటమికి శృంగభంగం తప్పదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఓటర్లు 160 నుంచి 170 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెడుతున్నారు. గత ఎన్నికల్లో 133 సీట్లు సాధించిన అన్నాడీఎంకే కూటమి 58 నుంచి 68 స్థానాలకే పరిమితమవుతుంది. కమలహాసన్ పార్టీ ప్రభావం పెద్దగా ఉందని తెలుస్తోంది.
ఇక కేరళలో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఫలితాలు ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. ప్రతి ఎన్నికలకు అధికార పార్టీని మార్చే సంప్రదాయాన్ని ఓటర్లు ఈసారి పక్కనపెట్టి వరుసగా రెండోసారి వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్)కు పట్టం కడతారని అంటున్నారు. 140 సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ 91, యూడీఎఫ్ 47 సీట్లు కలిగి ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్న కేరళ అసెంబ్లీలో తన బలం పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీకి ఓటర్ల మద్దతు ఏమాత్రం లభించినట్లు లేదు. ఎల్డీఎఫ్ తన బలాన్ని 104 వరకు పెంచుకునే అవకాశం ఉందని అంచనా.
పుదుచ్చేరిలో కమల వికాసం
మినీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఊరతనిచ్చే అంశం పుదుచేరిలో గెలుపే కావచ్చు. తొలిసారి ఈ కేంద్రపాలిత ప్రాంతంపై కాషాయ జెండా ఎగిరే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 30 స్థానాలున్న ఇక్కడ బీజేపీ, డీఎంకే కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి 17 నుంచి 25 స్థానాలు రావచ్చని అంచనా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కలిసి పోటీ చేసి 17 సీట్లు గెలుచుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కచ్చితంగా ఉంటాయని చెప్పలేం గానీ.. కోవిడ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ప్రధాని మోడీపై పెరుగుతున్న అసంతృప్తిని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిఫలించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read : దీదీ దే బెంగాల్.. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..