బిగ్ బి కెరీర్ లో మొట్టమొదటిసారి

ఇంకా మన తెలుగు అగ్ర నిర్మాతలు ఆలోచన దశలోనే ఉన్నారు కానీ థియేటర్ల ఓపెనింగ్ ఇప్పుడప్పుడే జరిగే సూచనలు కనిపించకపోవడంతో ఒక్కో బాష నుంచి ఓటిటి రిలీజుల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంకో నాలుగు నెలల దాకా జనం ఎప్పటిలాగా సినిమా హాళ్లకు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో నష్టాలను భరించే స్థోమత లేని వాళ్ళు డిజిటల్ కు అమ్మేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అమృతరామం వచ్చేసి నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కూడా. మార్కెట్ పరంగా చాలా పెద్దదైన బాలీవుడ్ లోనూ ఓటిటి ప్రకంపనలు మొదలైపోయాయి.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన ‘గులాబో సితాబో’ నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా జూన్ 12 నుంచి అందుబాటులోకి రానుంది. ఇంత పెద్ద సినిమా ఇలా స్ట్రెయిట్ డిజిటల్ లో రావడం ఈ ఏడాదిలో ఇదే మొదటిది. నిజానికి ఇది ఏప్రిల్ 17 థియేట్రికల్ రిలీజ్ నోచుకోవాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల సాధ్యపడలేదు. మరోవైపు భారీ మల్టీ స్టారర్లు సైతం విడుదల ఆగిపోయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న తరుణంలో దీన్ని ఇంకా ఆపితే చాలా జాప్యం జరుగుతుందని భావించి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట.

టిపికల్ డైరెక్టర్ గా పేరున్న సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన ఈ గులాబో సితాబో మీద ఫ్యామిలి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. లక్నో బ్యాక్ డ్రాప్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ జానర్ లో రూపొందిన ఈ మూవీ ప్రైమ్ లో భారీ స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ఇలా బుల్లితెరపై నేరుగా విడుదల కాబోతున్న మొదటి సినిమాగా కూడా గులాబో సితాబో ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇప్పుడు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకెందరు ముందుకు వస్తారో చూడాలి. అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ కూడా ఇదే తరహాలో డీజిల్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ముంబై టాక్. అయితే దాన్ని సమర్థిస్తూ కానీ ఖండిస్తూ కానీ ఎలాంటి ప్రకటన రాలేదు

Show comments