Idream media
Idream media
విశాఖ రాంకీ ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి సమయంలో ఫార్మా సిటీలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. రాంకీ సీఈటీపీలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో, పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్నిప్రమాదం సంభవించాయి. వరుసగా పేలుళ్లు జరుగుతుండడంతో అగ్నిమాపక శకటాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లలేకపోతున్నాయి. మంటలు ఎగసి పడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు.
భారీ పేలుళ్లతో ఫార్మా సిటీ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఆ ప్రాంతం అంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. పేలుళ్లతో స్థానిక ప్రజలు, కంపెనీల సిబ్బందిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు పక్కన ఉన్న కంపెనీలకు వ్యాపించే ప్రమాదం నెలకొని ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఘటనపై విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్ అప్రమత్తం అయ్యారు. వెంటనే అగ్రిమాపక, అంబులెన్స్‌లను అక్కడికి పంపారు. అయితే మంటలు ఆకాశం ఎత్తున ఎగసిపడుతుండడంతో అగ్నిమాపక శాఖ, వైద్యశాఖ సిబ్బంది దూరంగానే నిలిపోయారు.
ఫార్మా కంపెనీలలో మూడు షిప్టుల్లో 24 గంటలూ పని జరుగుతుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల్లో ప్రస్తుతం పని జరుగుతుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ పని జరుగుతుంటే అక్కడ ఉద్యోగుల పరిస్థితి ఊహించని విధంగా ఉంది. ప్రస్తుత అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొంది.