F.I.R : ఎఫ్ఐఆర్ రిపోర్ట్

తెలుగులో అంతగా సుపరిచితం కాని విష్ణు విశాల్ తమిళ సినిమాలు అలవాటున్న వాళ్లకు పరిచయమే. ముఖ్యంగా రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లకు గుర్తుండిపోయాడు. దాన్నే తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్ చేసుకున్నది. కోలీవుడ్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉన్న విష్ణు విశాల్ మొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దానికి కారణం ఎఫ్ఐఆర్ కి సమర్పకుడు మాస్ మహారాజా రవితేజ కావడమే. టెర్రరిస్టు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాకు దర్శకుడు మను ఆనంద్. ట్రైలర్ ఆసక్తి రేపినప్పటికీ ఖిలాడీ, డిజె టిల్లు పోటీతో పాటు హైప్ తక్కువగా ఉండటంతో ఓపెనింగ్స్ వీక్ ఉన్నాయి. ముందు రిపోర్ట్ చూద్దాం.

ఇర్ఫాన్ అహ్మద్(విష్ణు విశాల్) ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. తల్లి పోలీస్ కానిస్టేబుల్. ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ అయిన ఇర్ఫాన్ ని తీవ్రవాది అనే అనుమానంతో ఎన్ఐఎ టీమ్ అరెస్ట్ చేస్తుంది. చీఫ్ అజయ్ దీవాన్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఆధ్వర్యంతో చిత్రహింసలు పెట్టి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. సమాజంలో ఇర్ఫాన్ ముస్లిం టెర్రరిస్టుగా ముద్ర వేయబడతాడు. కానీ తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేయాలని నిర్ణయించుకుని ఏం చేశాడు, అసలు ఇతను ఈ కుట్రలో ఇరుక్కోవడానికి ప్రధాన కారణం, బాంబు పేలుళ్ల వెనుక సూత్రధారులు ఎవరు, ఎలా దొరికారు లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడాల్సిందే.

ఎక్స్ ప్రెషన్ల పరంగా గొప్పగా చెప్పుకునే నటనను ప్రదర్శించలేని బలహీనత ఉన్న విష్ణు విశాల్ ఇందులో మెరుగయ్యాడు. నిర్మాత తనే కాబట్టి చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ రెబా మౌనిక మొక్కుబడిగా ఉంది. గౌతమ్ మీనన్ మరోసారి ఉనికిని చాటుకున్నారు. డైరెక్టర్ మను ఆనంద్ టేకింగ్ ఆసక్తికరంగా మొదలుపెట్టినప్పటికీ తర్వాత ప్రొసీడింగ్స్ ని సరిగా హ్యాండిల్ చేయలేక బాగా తడబడ్డారు. ఫలితంగా మధ్యలో ల్యాగ్ బాగా ఎక్కువయ్యింది. చివరి అరగంట సంతృప్తి కలిగించినప్పటికీ ఓవరాల్ గా చెప్పుకుంటే విజయ్ తుపాకీ రేంజ్ లో గొప్పగా పేలాల్సిన సబ్జెక్టు సాధారణంగా మిగిలిపోయింది. ఇలా చేయని తప్పుకు నిందలు పడే హీరో క్యారెక్టర్లు గతంలో మనకు షాక్, మనోహరం, నాంది లాంటివి చాలా వచ్చాయి. ఎఫ్ఐఆర్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. యావరేజ్ అంతే

Also Read : Sarkaru Vaari Paata : సోషల్ మీడియాలో సర్కార్ ప్రకంపనలు

Show comments