తుది దశకు పంచాయతీ పోరు.. పోటెత్తుతున్న ఓటర్లు..

పల్లె పోరు తుది దశకు చేరుకుంది. ఈ రోజు చివరిదైన నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పల్లె ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఉదయం 6:30 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 10:30 గంటలకు దాదాపు 40 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు గ్రామాల్లో భారీగా పోలింగ్‌ నమోదవుతోంది. విశాఖ జిల్లా ముకుందాపురం గ్రామంలో మొదటి మూడు గంటల్లోనే 70 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ప్రతి విడతలోనూ 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్‌ నమోదయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సాయంత్ర నాలుగు గంటల నుంచి కౌటింగ్, ఫలితాలు వెల్లడించనున్నారు.

తుది విడతలో 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోని 161 మండలాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 554 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 2,743 పంచాయతీలలో పోటి నెలకొంది. 7,475 మంది సర్పంచ్‌ పదవికి పోటీ ఉన్నారు. 33,435 వార్డులకు గాను 10, 921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 91 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 22, 514 వార్డులకు పోలింగ్‌ జరుగుతుండగా 52,700 మంది బరిలో నిలిచారు. తుది దశలో 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మూడు దశలు ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు దశల్లోనూ అధికార పార్టీ వైసీపీ బలపర్చిన అభ్యర్థులు భారీగా జయకేతనం ఎగురవేస్తున్నారు. భారీ మెజారిటీలు సాధిస్తున్నారు. దాదాపు 85 స్థానాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 88 స్థానాలకు గాను వైసీపీ అభ్యర్థులు 74 స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడం సంచలనమైంది. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు కేవలం 14 పంచాయతీలకే పరిమితం కావడంతో జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. తుది దశలోనూ అదే తరహా ఫలితాలు వస్తాయనే అంచనాలున్నాయి.

Show comments