మహేష్ – మాస్టర్ నుంచి సూపర్ స్టార్ దాకా

ఒక హీరో నలభై ఏడేళ్ల వయసొచ్చినా కాలేజీ స్టూడెంట్ గా నటిస్తే ఒప్పుకునే ప్రేక్షకులు ఉండటమంటే అది ఒక్క మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంలో కాలేజీకి వెళ్తే ఆయన వయసు తెరమీద తెలిసిపోయేది. కానీ మహేష్ మాత్రం అలా కాదు. మహర్షి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఒక్కడు, పోకిరి రీ రిలీజ్ లను ఏదో కొత్త సినిమా విడుదలవుతోందన్నంత హై రేంజ్ లో హంగామా చేస్తున్నారు.

1979లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నీడతో కెరీర్ మొదలుపెట్టిన మహేష్ పదేళ్లకు పైగానే మాస్టర్ కార్డుతో కెరీర్ కొనసాగించాడు. శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం కమర్షియల్ గానూ మంచి విజయాలు సాధించిన సూపర్ హిట్లు. తండ్రి కృష్ణే హీరో అయినప్పటికీ వీటిలో భవిష్యత్తు సూపర్ స్టార్ ని అప్పట్లోనే చూసుకునేవారు అభిమానులు. 1990 అన్న తమ్ముడు, బాలచంద్రుడు ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో చదువుతో పాటు నటనలో శిక్షణ కోసం బ్రేక్ ఇప్పించారు కృష్ణ.

1999లో సోలో హీరోగా ‘రాజకుమారుడు’తో గ్రాండ్ డెబ్యూ అందుకున్న మహేష్ కు మొదటి సినిమా నుంచే వెనుదిరిగే అవసరం లేకపోయింది. ‘యువరాజు’ వయసుకు మించిన పాత్రలు చేయొద్దని హెచ్చరిస్తే ఉత్తి హంగులను నమ్ముకోవద్దని ‘వంశీ’ పాఠం నేర్పించింది. తనలో అసలైన యాక్టర్ ని బయటికి తీసింది మాత్రం ‘మురారి’నే. టక్కరి దొంగ, బాబీ మళ్ళీ బ్రేకులు వేస్తే అసలైన స్టామినా చాటింది మాత్రం ఒక్కడు. ఛాలెంజ్ గా తీసుకుని చేసిన నిజం ఫెయిలైనా పెర్ఫార్మన్స్ మాత్రం బెస్ట్ గా నిలిచిపోయింది.

నాని, అర్జున్ లు ఫ్లాప్ అయితే ‘అతడు’ కల్ట్ స్టేటస్ ని సంపాదించుకుంది. పోకిరితో మహేష్ లోని అసలైన ఊర మాస్ తీసిన పూరి జగన్నాధ్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు సరిచేయించాడు. సైనికుడు, అతిధి, ఖలేజాతో కుదుపులు వచ్చాయి. దూకుడు హిస్టరీ రీ క్రియేట్ చేసింది. బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయగా 1 నేనొక్కడినే, ఆగడు సెల్ఫ్ పోస్ట్ మార్టం కి అవకాశం ఇచ్చాయి. శ్రీమంతుడుతో తిరిగి రికార్డులు పాదాక్రాంతం కాగా బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్లు ఆలోచనలో పడేశాయి.

అందుకే గ్యాప్ తీసుకుని చేసిన ‘భరత్ అనే నేను’ మరో విజయాన్ని అందిస్తే ‘మహర్షి’ సందేశంతో పాటు కమర్షియల్ స్టామినా మళ్ళీ రుచి చూపించింది. సరిలేరు నీకెవ్వరు బలమైన పోటీని తట్టుకుని మరీ బ్లాక్ బస్టర్ అందుకుంది. సర్కారు వారి పాట కంటెంట్ కొంత బ్యాలన్స్ తప్పినా కేవలం మహేష్ ఇమేజే కోట్ల నష్టం రాకుండా కాపాడిందన్నది వాస్తవం.


మహేష్ నటించడమే కాదు స్నేహ ధర్మం కోసం జల్సా, బాద్షా, ఆచార్యలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇతర అభిమానుల మనసులను దోచుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే వేలాది చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం మహేష్ చేసిన సాయం, గుప్త దానాలు సినిమాలకు మించిన గొప్ప ఖ్యాతిని అందించిన మాట వాస్తవం

Show comments