iDreamPost
android-app
ios-app

ఎంపీ కేకేకు ఫేక్ ఫోన్ కాల్ : కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో బురిడీ..!

ఎంపీ కేకేకు ఫేక్ ఫోన్ కాల్ : కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో బురిడీ..!

ఉద్యోగాలిప్పిస్తామ‌ని, రుణాలిస్తామ‌ని కాల్స్ చేస్తూ సామాన్యుల‌ను బురిడీ కొట్టిస్తున్నారు కొంద‌రు కేటుగాళ్లు. అలాగే ఇటీవ‌ల కాలంలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల పేరుతో మోసాల‌కు పాల్ప‌డుతున్నారు మ‌రి కొంద‌రు. చాలా మంది అమాయ‌కులు వారి వ‌ల‌లో ప‌డి మోస‌పోతున్నారు కూడా. అయితే ఏకంగా ఓ ఎంపీకే ఫోన్ చేసి కేంద్ర ప్ర‌భుత్వ పథకం పేరుతో మోసం చేసేందుకు య‌త్నించాడో ఘ‌నుడు.

కొన్ని రోజుల త‌ర్వాత అనుమానంతో ఆయ‌న వాక‌బు చేస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంటూ ఇటీవల ఎంపీ కేకేకు మ‌హేష్ పేరుతో ఒక‌డు ఫోన్ చేశాడు. 25 మంది నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణం ఇస్తామని తెలిపాడు. మంత్రి కేటీఆర్ సిఫార్సుతో మీకు ఇవ్వాలనుకుంటున్నామని ఎంపీకి చెప్పాడు. ఇది నిజ‌మే అనుకున్న ఆయ‌న తన కుమార్తె, బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ గద్వాల విజయ లక్ష్మితో మాట్లాడాలని సూచించారు.

నిరుద్యోగుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని…

ఎంపీ సూచ‌న మేర‌కు ఆ కేటుగాడు కేకే కుమార్తె విజ‌య‌ల‌క్ష్మితో మాట్లాడాడు. ఆయ‌న మాట‌లు విన్న ఆమె తమ డివిజన్లలో నిరుద్యోగులకు ప్రయోజనం ఉంటుందని భావించి కొంతమందికి ఈ విషయాన్ని చెప్పారు. కొంద‌రు ఆ రుణం పొందేందుకు ఆస‌క్తి చూపారు. మ‌హేష్ ను కాంటాక్ట్ చేశారు. అయితే ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరు 1.25 లక్షలు తన అకౌంట్‌లో వేయాలని మహేష్ కోరడంతో.. అఖిల్ అనే యువకుడు రూ.50వేలు వేశాడు. కార్పొరేట‌ర్ ద్వారా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డంతో మ‌రి కొంద‌రు కూడా డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ లోపు మహేష్ డ‌బ్బులు అడుగుతున్నాడ‌న్న విష‌యం తెలుసుకున్న కేకే అనుమానంతో వాకబు చేశారు. కేంద్ర పరిశ్రమల శాఖలో మ‌హేష్ పేరుతో డిప్యూటీ డైరెక్టర్ ఎవ‌రూ లేర‌ని తేలింది. అది బోగస్ అని తెలియడంతో మిగిలిన వారు డబ్బులు వేయకుండా వారించారు. డబ్బులు వేసిన అఖిల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మ‌హేష్‌పై కేసు నమోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.