మూడేళ్ల వరకూ స్థానిక ఎన్నికలు జరపరట..!

స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. రాజకీయ పార్టీల నేతల తమ నోటికి పని చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ మీడియాకు మంచి ఫీడ్‌ ఇస్తున్నారు. సాధ్యాసాధ్యాలు, నిజా నిజాలతో సంబంధం లేకుండా మాట్లాడే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కామెంట్‌ చేశారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం వైఎస్‌ జగన్‌ జరగనివ్వరట. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించినా.. వైఎస్‌ జగన్, ఆయన అనుచరులు కోర్టులకు వెళ్లి అయినా.. అడ్డుకుంటారట. వైసీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగవట. అంటే.. మూడేళ్ల పాటు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని జేసీ దివాకర్‌ రెడ్డి తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీడియాలో కనిపించే దివాకర్‌ రెడ్డి.. ఇటీవల కొద్ది నెలలుగా సైలెంట్‌ అయ్యారు. తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జైలుకు వెళ్లడం, గనుల లీజు రద్దు కావడం వంటి పరిణామాల తర్వాత జేసీ సైలెంట్‌ అయ్యారు. చాలా గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకు వచ్చిన జేసీ దివాకర్‌ రెడ్డి.. వచ్చీ రాగనే.. స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియాకు బ్రేకింగ్‌న్యూస్‌ ఇచ్చి మళ్లీ ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి మిగిలి ఉన్న మూడేళ్ల వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపరంటూ వ్యాఖ్యానించిన జేసీ నుంచి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు వస్తాయో చూడాలి.

Show comments