iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో యువ మంత్రి.. ఆ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో యువ మంత్రి.. ఆ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుడు ఓ వెలుగు వెలిగారు. ఎన్టీ రామారావు కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఎన్టీ రామారావు తర్వాత టీడీపీలో చంద్రబాబు శకం ప్రారంభమైనప్పుడు కూడా ఆయన హవా ఏ మాత్రం తగ్గలేదు. ఎన్టీఆర్‌ శకంలో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సదరు రెడ్డి గారు, చంద్రబాబు శకం ప్రారంభమయ్యాక ఒక్కసారి ఎమ్మెల్యే కాలేదు. అయినా కూడా పార్టీలో ఆయకు పెద్దపీట లభించింది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ముక్కు కాశిరెడ్డి.

కిరోసిన్‌ డీలర్‌గా ఉన్న ముక్కు కాశిరెడ్డి ఎన్టీ రామారావు చలువతో ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ ఆవిర్భావంతోనే రాజకీయాల్లోకి వచ్చిన కాశిరెడ్డి విద్యాధికుడన్న కారణంతో ఎన్టీ రామారావు మంచి ప్రాధాన్యత ఇచ్చారు.  ఎన్టీ రామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తో కాలేజీరోజుల్లో ఉన్న పరిచయాలు కాశిరెడ్డి కి రాజకీయంగా ఎదిగేందుకు ఉపయోగపడ్డాయి. 1983, ఆ తర్వాత 1985, 1994 శాసన సభ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989,1999, 2004 ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి ఇరిగినేని తిరుపతి నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు.

1999 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. కాశిరెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2001లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అయ్యారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావడం వల్లనే కాశిరెడ్డి రాజకీయ జీవితానికి ఎదురుగాలి వీచిందని ఆయన గురించి తెలిసిన వారు చెప్పుకుంటుంటారు. 2004 ఎన్నికలే కాశిరెడ్డికి చివరి ఎన్నికలయ్యాయి.

2009 ఎన్నికల్లో కాశిరెడ్డికి టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు. బాలకృష్ణ స్నేహితుడు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు టిక్కెట్‌ దక్కింది. బాలకృష్ణ ఒత్తిడితోనే చంద్రబాబు టిక్కెట్‌ కేటాయించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కాశిరెడ్డి ఇంటి పేరు ఉన్న ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి టిక్కెట్‌ దక్కింది.

టీడీపీ ఆవిర్భావం సమయంలో ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఇరిగినేని తిరుపతి నాయుడు 1985 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కనిగిరి టిక్కెట్‌ ఆశించారు. రెడ్డి సామాజికవర్గ ప్రజలు అధికంగా ఉన్న కనిగిరిలో 1983 లో ఎమ్మెల్యేగా గెలిచిన కాశిరెడ్డికే తిరిగి ఎన్టీరామారావు టిక్కెట్‌ కేటాయించారు. దీంతో తిరుపతి నాయుడు ఏనుగు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1500 ఓట్ల తేడాతో కాశిరెడ్డిపై ఓడిపోయారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా యాదవ సామాజికవర్గానికి చెందిన న్యాయవాది ప్రభాకర్‌ పోటీ చేశారు. కనిగిరిలో రెడ్లు తర్వాత అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం యాదవులు. ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మదుసూధన్‌ యాదవ సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధే.

1985 ఎన్నికల్లో ఇరిగినేని బలం చూసిన కాంగ్రెస్‌ ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంది. 1989 ఎన్నికల నుంచి 2004 వరకూ కాంగ్రెస్‌ తరఫున ఇరిగినేని తిరుపతినాయుడు, టీడీపీ తరఫున ముక్కుకాశిరెడ్డిలు పోటీ చేశారు. యాదృచ్ఛికంగా ఇద్దరికీ 2004 ఎన్నికలే చివరివి అయ్యాయి. ఇరిగినేనికి వయస్సు మీదపడడంతో కాంగ్రెస్‌ అధిష్టానం 2009లో పార్టీ టిక్కెట్‌ను ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కేటాయించింది. 2017లో తిరుపతినాయుడు కాలం చేశారు.

ఇక కాశిరెడ్ది విషయానికి వస్తే.. 2009 ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ దక్కకపోవడంతో టీడీపీని వీడారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి మద్ధతు తెలిపారు. టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు నామినేషన్‌ చెల్లకపోవడంతో టీడీపీ.. స్వతంత్ర అభ్యర్థి, కదిరి బాబురావుకు సమీప బంధువు అయిన సుంకర మధుసూదన్‌రావుకు (ఉంగరం గుర్తు)కు మద్ధతు తెలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కేవలం 1900 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అది కూడా ముక్కు కాశిరెడ్డి వర్గం తనకు పని చేయడం వల్లే గెలిచానని పలు సందర్భాల్లో ఉగ్ర నరసింహారెడ్డే స్వయంగా చెప్పారు.

వైసీపీ ఆవిర్భావంతో ముక్కు కాశిరెడ్డి ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో కనిగిరి సీటు తనకు వస్తుందని ఆశించారు. కానీ సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా కనిగిరి సీటు యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు దక్కింది. కనిగిరి పక్క నియోజకవర్గం కందుకూరుకు చెందిన మధుసూదన్‌ యాదవ్‌ చివరి నిమిషంలో అభ్యర్థి కావడం, నాన్‌లోకల్‌ అని టీడీపీ ప్రచారం చేయడం, అంతకు ముందు ఎన్నికల్లో కదిరి బాబురావు నామినేషన్‌ చెల్లకపోవడం వల్ల వచ్చిన సెంటిమెంట్‌తో 2014 ఎన్నికల్లో కదిరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

2014 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్‌ రాకపోవడంతో ముక్కు కాశిరెడ్డి తన రాజకీయ జీవితం అయిపోయిందనే భావనకు వచ్చారు. అప్పటి నుంచి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. సాయిబాబా భక్తుడిగా మారారు. నిత్యం బాబా పూజలు, ప్రార్థనలతో తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో గడుపుతున్నారు. కాశిరెడ్డి తన కుమార్తెలను (కుమారులు లేరు) రాజకీయాలకు దూరంగా ఉంచడంతో ఆయన రాజకీయ చరిత్ర ముగిసిందనే చెప్పవచ్చు.