Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఏకైక లక్ష్యంతో దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరు తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల వినతులు, ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేస్తున్న రాద్ధాంతంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. నిమ్మగడ్డ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని, ఎవరో అదృశ్య వ్యక్తి అతని వెనుకుండి నడిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
‘‘ రాష్ట్ర ప్రభుత్వంపై మీ దాడి విచారకరం. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించాలి గానీ రాజకీయ నాయకుడిలా పట్టుదలకు పోవడం మంచిది కాదు. నేరం నాది కాదు – ఆకలిది అన్న సినిమా పేరు మాదిరిగా మిమ్మల్ని ఎవరో అదృశ్య వ్యక్తి నడిపిస్తుండడంతోనే ఈ తలనొప్పులు. పెద్ద హోదా కలిగిన ఉద్యోగంలో ఉంటూ రాజకీయాలు చేయడం మంచిగా లేదు. ఇలాంటి పరిస్థితి భారత దేశంలో తొలిసారి చూస్తున్నాను. అవకాశం ఉంటే ప్రజలు మేలు చేసే సలహాలు ఇవ్వండి’’ అంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహర శైలిని ముద్రగడ పద్మనాభం తూర్పారబట్టారు.
ఎస్‌ఈసీకి ఉన్న విశిష్ట అధికారాలతో సంస్కరణలు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని మద్రగడ పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారులు.. డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరిపామని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా..? అంటూ నిమ్మగడ్డను ప్రశ్నించారు. తగువులు పడడం వల్ల ప్రభుత్వ ఖాజానకు నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాలో చేరిన సొమ్ము ప్రజల పన్నుల ద్వారా వచ్చిందన్న విషయం మరిచిపోవద్దని హితవుపలికారు. ప్రజల డబ్బు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలి కానీ మీ పంతాలకు, పట్టింపులకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముద్రగడ పద్మనాభం చురకలు అంటించారు.