థియేటర్లకు దుబాయ్ రూటే మార్గం

ఇవాళ్టి నుంచి ఇండియాలో ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ క్రమంగా తెరుచుకుంటున్నాయి. కంటోన్మెంట్ జోన్లు మినహాయించి అన్ని చోట్ల జనజీవనం సాధారణం అయిపోతోంది. కేసుల పెరుగుదల మాట ఎలా ఉన్నా జనం దాన్ని పట్టించుకునే మూడ్ లో లేరు. ఇక బాలన్స్ ఉన్నది సినిమా థియేటర్లు మాత్రమే. ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వాలు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తాయా అని అన్ని బాషల నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మిగిలిన దేశాల్లో క్రమంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. జూన్ 11 అంటే ఈ గురువారం నుంచే దుబాయ్ లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి.

ఆ రోజు అక్షయ్ కుమార్ నటించిన గుడ్ న్యూజ్ ని రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. హాళ్లకు జనం వస్తారో రారో అని టెస్ట్ చేయడానికి ఇదో మంచి ఆలోచన. కొత్త సినిమాలైతే పబ్లిక్ రాకపోతే రెవిన్యూ పరంగా రిస్క్ లో పడతాయి. అందుకే ఇలా గత ఏడాది వచ్చిన వాటిని వేసుకోవడం ఒకరకంగా సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియాలోనూ ఇదే అమలు పరచాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే కొన్నిరోజులు ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు రాలేరు. జంకుతారు. మనసులో అంతో ఇంతో భయం ఉంటుంది. కాబట్టి బాగా ఆడిన హిట్ సినిమాలు వేసి ఓ నెల రోజులు మేనేజ్ చేయగలిగితే అప్పుడు ధైర్యంగా కొత్త రిలీజులు అనౌన్స్ చేసుకోవచ్చు.

ఎలాగూ భీష్మ, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటివి ఫీడింగ్ కోసం రన్ చేయాలి. టికెట్ ధరలు కొంత తగ్గించి ఆ దిశగా చర్యలు చేపడితే ఆలోగా అందరికి అలవాటైపోతుంది. రెండు నెలల క్రితమే ఇడ్రీమ్ ఈ తరహా ప్రతిపాదన మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. జూన్లో కాకపోయినా జులై అయినా సరే ఇదొక్కటే ప్రస్తుతానికి ఉన్న మార్గం. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో అనుమతులు వచ్చేయడంతో రెడీ టు రిలీజ్ సినిమాల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒకేసారి అన్ని విడుదల చేయడం కూడా అనవసరపు రిస్క్. అందుకే ముందుగా థియేటర్ల గేట్లు తెరిచి పాత సినిమాలతో మొదలుపెట్టి క్రమపద్ధతిలో కొత్తవాటిని ప్లాన్ చేసుకోవాలి. దుబాయ్ లో జూన్ 11 నుంచి సందడి మొదలుకానుంది. మరి మన ఎదురు చూపులు ఎప్పటికి తీరునో

Show comments