iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప భవితవ్యం గందరగోళంలో పడుతోంది. రాజకీయంగా ఆయన ప్రస్థానం చుట్టూ ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. కోనసీమ నుంచి వలస వెళ్లి ఆయన పెద్దాపురంలో రెండుమార్లు విజయం సాధించారు. 2019లో సైతం జగన్ గాలిని ఎదుర్కొని గట్టెక్కారు. 2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టగానే ఏకంగా హోం మంత్రిత్వ శాఖ ఆయనకు దక్కింది. దానిని ఆసరాగా చేసుకుని పెద్దాపురంలో పాగా వేశారు
ఇక తదుపరి ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పలు సందేహాలకు ఆస్కారమిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. పొత్తుల కోసం తహతహలాడుతోంది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఖరారవుతుందా లేదా అనే దానిని బట్టి రాజప్ప రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తే పెద్దాపురం సీటుని రాజప్ప ఖాళీ చేయాల్సి ఉంటుంది. జనసేన ఖచ్చితంగా కోరే స్థానాల్లో పెద్దాపురం ఉంటుంది.
2009 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ప్రజారాజ్యం విజయం సాధించింది. గోదావరి జిల్లాల్లో పీఆర్పీ గెలిచిన ఐదు సీట్లలో పెద్దాపురం ఒకటి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన మెజార్టీ సీట్లు గోదావరి జిల్లాల్లో తీసుకుంటే వాటిలో పెద్దాపురం ఉంటుంది. కాబట్టి సీనియర్ నేత అయినప్పటికీ రాజప్పకు స్థానభ్రంశం అనివార్యం. అయితే రాజప్పకు చంద్రబాబు అన్యాయం చేస్తారా లేక కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి పోటీలో దింపుతారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనను ఎంపీ సీటు చూసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు ఇప్పటికే రాజప్ప తన సన్నిహితులకు చెబుతున్నారు. కానీ దానికి తాను అంగీకరించలేదని కూడా అంటున్నారు. దాంతో రాజప్ప అయిష్టంగా పెద్దాపురం వీడితే ఆ తర్వాత ఏమిటన్నది ప్రశ్నార్థకం.
వాస్తవానికి టీడీపీ అధినేత ఎంపీ సీట్లను దాదాపుగా దిగుమతి చేసుకున్న నాయకులకు కేటాయిస్తూ ఉంటారు. చివరి నిమిషంలో పార్టీలో చేరే వారికి కట్టబెడుతూ ఉంటారు. దాంతో కాకినాడ సీటుని ప్రస్తుతానికి రాజప్ప చూసుకోవాలని చెప్పినా చివరికి ఆయనే ఎంపీగా పోటీ చేసే అవకాశాలు చాలా స్వల్పం. దాంతో పెద్దాపురం ఖాళీచేయాల్సిన పరిస్థితి వస్తే రాజప్పకు పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి.