రూ.కోటి 25 లక్షలు పెట్టి.. గణేష్ లడ్డు కొన్న వ్యక్తి ఎవరో తెలుసా?

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం కనుల పండుగా కొనసాగుతుంది. గణేశుని నిమజ్జన శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. నిమజ్జనం నిమిత్తం గల్లీల నుండి వినాయక విగ్రహాలు కదులుతున్నాయి. ఎక్కడ చూసినా డీజే హోరులు, డ్యాన్సులతో హంగామా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి, బాలాపూర్ వినాయక విగ్రహాలను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు ఆ ప్రాంతంలో. నిమజ్జనం దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 40 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

నిమజ్జనం ముందు పలు వినాయక విగ్రహాలకు సంబంధించిన లడ్లు వేలం పాటలు వేశారు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు. అందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే బాలాపూర్ లడ్డు రూ. 27 లక్షల ధర పలికింది. అదేవిధంగా మరో లడ్డు రికార్డు స్థాయి ధరను కొల్లగొట్టింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలోని సన్ సిటీలో ఏర్పాటు చేసిన లడ్డు.. రూ. కోటి 25 లక్షలు పలికింది. తెలంగాణలో చరిత్రలో లడ్డూకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. గత ఏడాది ఇక్కడి లడ్డుకు వేసిన వేలంలో రూ. 60 లక్షల 80 వేల పలకడం విశేషం. ఇప్పుడు వేసిన వేలంలో ఈ లడ్డు రెండింతలు అధిక ధరకు పలకడం గమనార్హం. ఈ లడ్డును ఎవరు కొనుగోలు చేశారంటే.. ఓ వ్యక్తి కాదూ..  ఆర్‌వి దియా చారిటీ సభ్యులు దీన్ని వేలంలో కొన్నారు.

ఇంతకు ఈ ఆర్‌వి ఛారిటీ ఏంటంటే..? ఇదొక కమ్యూనిటీ. ఈ చారిటబుల్ ట్రస్ట్ సేవా భావంతో పనిచేస్తుంది. ఈ చారిటబుల్ ట్రస్ట్ మెడికల్ సపోర్టు ఇవ్వడంతో పాటు, పేద విద్యార్థుల చదువులకు వినియోగిస్తున్నారు. మరికొన్ని ఎన్జీజీవో సంస్థల భాగస్వామ్యంతో కలిసి పేదలకు నెలవారీ కిరాణా సరుకులను కూడా అందిస్తుంది. కేవలం సేవా భావంతోనే ఈ సంస్థ పనిచేస్తుండటం విశేషం. కాగా, గత రెండేళ్లుగా ఆ ఛారిటీ సభ్యులే కమ్యూనిటీగా ఏర్పడి లడ్డును కొనుగోలు చేస్తుంటారు. వేలంలో లడ్డూను కొనుగోలు చేసి వచ్చిన డబ్బును ఆర్‌వి ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటారు. వీరి ఉద్దేశం కేవలం లడ్డూను కొనుగోలు చేయడం కాదు. అంతకు మించిన సేవాభావం ఉంది. ఇలా చేయడం వల్ల ఈ సంస్థ గురించి మరికొంత మందికి తెలిసి ఫండ్స్ కూడా వస్తాయి. దీంతో మరింత సేవ చేయవచ్చునన్న ఉద్దేశంతో గత మూడేళ్లుగా వీరే లడ్డూను కొనుగోలు చేసి.. ఆర్ వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ డబ్బులను పేద ప్రజలకు వినియోగిస్తున్నారు. .

Show comments