iDreamPost
android-app
ios-app

కరోనా బాధితులూ.. జాగ్రత్త

  • Published Nov 15, 2020 | 2:27 AM Updated Updated Nov 15, 2020 | 2:27 AM
కరోనా బాధితులూ.. జాగ్రత్త

అందరూ సంతోషంగా దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చే దీపావళికి సిద్ధమయ్యారు. వయస్సులతో సంబంధం లేకుండా అందరూ సంబరపడే పండుల్లో ఇదీ ఒకటి. అయితే 2020 మాత్రం ఈ పండుగను కూడా పరిమితంగా చేసేసిందనే చెప్పాలి. కోవిడ్‌ విస్తృతి కారణంగా ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మందికి వైరస్‌ వ్యాపించింది. ఇందులో అత్యధికశాతం మంది పూర్తిగా కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. అయితే పాజిటివ్‌ నుంచి కోలుకున్న వారిలో కొందరికి పోస్ట్‌ కోవిడ్‌ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ఊపిరిత్తులు సంబంధించిన సమస్యగా చెబుతున్నారు. కోవిడ్‌ ప్రధానంగా దాడిచేసేది ఊపిరితిత్తులపైనే అన్నది అందరికీ తెలిసిందే.

వ్యాధి నుంచి కోలుకున్న తరువాత కూడా కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు ఇప్పటికే సూచిస్తున్నారు. అయితే ఈ లోపు దీపావళి బాణా సంచా కారణంగా ఏర్పడే ప్రమాదకర రసాయనిక పొగకు ఊపిరితిత్తులు ప్రభావితమైతే ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఆరోగ్య వంతులకు సైతం ఈ పొగ ఊపిరి సలపనీయకుండా ఇబ్బంది పెట్టడం అందరికీ అనుభవంలోకొచ్చేది. అయితే పాజిటివ్‌ నుంచి కోలుకున్న వారికి ఇది ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుందని ముందుగానే వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇళ్ళ నుంచి బైటకు రాకుండా జాగ్రత్త పడాలని, పొగను నేరుగా పీల్చొద్దని సూచనలు చేస్తున్నారు. అంతే కాకుండా ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా పలువురికి కోవిడ్‌ వచ్చి తగ్గిపోయిన వారు కూడా ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారికి కూడా బాణాసంచా నుంచి వెలువడే రసాయనాల పొగ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.

ఈ నేపథ్యంలో గ్రీన్‌ ట్రిబ్యునల ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో బాణా సంచా అమ్మకాలపై కూడా నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరికొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలతో కూడిన దీపావళి పండుగకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వాల పరంగా ఇచ్చే ఆదేశాలు, సూచనల కంటే కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు కోవిడ్‌ బాధితులకు కూడా మంచి చేసిన వాళ్ళమవుతామన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.

ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన బాణాసంచాకు దూరంగా ఉండడంతోపాటు, వీలైనంత తక్కువగా మాత్రమే కాలుష్యం వెదజల్లే గ్రీన్‌క్రాకర్స్‌కు ప్రాధాన్యమివ్వాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్‌ను జయించడంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ధైర్యంగానే ప్రజలు ఎదుర్కొన్నారు. అదే రీతిలో కోవిడ్‌బాధితుల ఆరోగ్యాన్ని కూడా కాపాడేందుకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందన్నది గుర్తించాలి.