Idream media
Idream media
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులు వద్దని 300 రోజులకు పైగా జరుగుతున్న అమరావతి ఉద్యమ జ్వాలను ఆరకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా అయితే.. వారితో పోటీ పడుతున్న క్రెడిట్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు దక్కుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పోటీగా సీపీఐ రామకృష్ణ కూడా అమరావతి వాయిస్‌ను వినిపిస్తున్నారు. బాబుకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో రామకృష్ణ విమర్శలపాలవుతున్నా.. వెనక్కి మాత్రం తగ్గకపోవడం విశేషం.
నిన్న మొన్నటి వరకూ అమరావతి, మూడు రాజధానులు అంశాలుగా ప్రజల రిఫరెండం కోరదామని, రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. పైగా డెడ్‌లైన్ కూడా విధించారు. బాబు పాటనే టీడీపీ నేతలు కూడా పాడారు. కొన్నాళ్లుగా రిఫరెండం, రాజీనామాలు, ఎన్నికలు.. అనే అంశాలను టీడీపీ అధినేత చంద్రబాబుగానీ, ఆ పార్టీ నేతలు గానీ మాట్లాడడం లేదు. వ్యవహారం కోర్టులో ఉండడంతో అక్కడే తమకు చేతనైన పంథాలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా వారి వ్యవహారం ఉంది.
అయితే టీడీపీ నేతలు మౌనం పాటిస్తున్నా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ చేస్తున్నారు. నాడు బాబు ఆలపించిన పాటను.. రామకృష్ణ నేడు అందుకున్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి వైసీపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా తాము అమరావతి అంశం ఎత్తబోమని చెప్పుకొస్తూ.. టీడీపీ నేతలను తలపిస్తున్నారు.
రామకృష్ణ వ్యవహరిస్తున్న తీరు కమ్యూనిస్టు విధానాలకు భిన్నంగా ఉందనే విమర్శలు భారీగా వస్తున్నాయి. సంపద కేంద్రీకరణకు, కొంత మంది చేతుల్లోనే ఉండేందుకు కమ్యూనిస్టులు పూర్తి వ్యతిరేకం. సంపద వికే ంద్రీకరణ జరగాలి, సంపద ప్రజలందరికీ సమానంగా పంచాలనేది కమ్యూనిస్టుల విధానం కాగా.. దీనికి భిన్నంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని ప్రభుత్వంతోపాటు ఆయా పార్టీలలోని స్థానిక నేతలు, ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే అమరావతి ఉద్యమం మూడొందల రోజులు పూర్తయినా.. ఇంకా 29 గ్రామాలకే పరిమితమైంది.
అమరావతి ఉద్యమానికి ప్రజా మద్దతు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా.. రామకృష్ణ పాడే అమరావతి పాట వల్ల సీపీఐకి లాభం రాకపోగా.. నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అయినా.. రామకృష్ణ ముందుకు వెళుతున్నారంటే.. ఎవరి ప్రయోజనాల కోసమనేదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అమరావతే రాజధాని కావాలనుకునే పార్టీలు.. ఆ గ్రామాలలో ఉద్యమం చేయడం కాదు.. రాష్ట్ర మొత్తం తిరిగి ఉద్యమం చేయాలన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటల వెనుక ఆంతర్యం రామకృష్ణకు అర్థం అయి.. తన సొంత ప్రాంతమైన రాయలసీమలో ఉద్యమం చేస్తే..అసలు విషయం బోధపడే అవకాశం ఉంది. మరి తమ జాతీయ నాయకుడు సలహాను పాటించే సాహసం రామకృష్ణ చేస్తారా…?