Idream media
Idream media
సినీ నటులు, రాజకీయ నాయుకులు చేసే ప్రకటనలకు, మాట్లాడే మాటలకు ఎంతో విలువ ఉంటుందని, వారి మాటలు ప్రజలను ప్రభావితం చేస్తాయంటారు. అందుకే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని విజ్ఞణులు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం కొంత మంది రాజకీయ నాయకులు ఈ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేసినట్లే కనిపిస్తున్నారు. ప్రభుత్వంపైనా, లేదా తమ రాజకీయ ప్రత్యర్థి, పార్టీపైనా విమర్శలే లక్ష్యంగా వారు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అవుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థల ఔన్నత్యాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ నిబద్ధతను ప్రశ్నించేలా, పనితీరుపై అనుమానాలు కలిగేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)ని బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ నారాయణ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని, సీజే బదిలీకి ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోందని నారాయణ ఆరోపించారు. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వంలో ఉన్న వారిపై అవినీతి ఆరోపణలు చేసినంత సులువుగా నారాయణ న్యాయవ్యవస్థపై చేయడం సంచలనమవుతోంది.
వ్యక్తిగత కేసులు, ఇతర వ్యవహారాల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా కోర్టుల్లో లాబీయింగ్ చేయొచ్చన్న ప్రచారం ఇప్పటికే బలంగా ఉంది. ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి, అక్రమాస్తులు తదితర వ్యవహారాలపై దాఖలైన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు రావడమే ఈ ప్రచారానికి ప్రధాన కారణం. ఈ మధ్య కాలంలో ఓటుకు నోటు కేసులో పక్కా ఆధారాలు ఉన్నా చంద్రబాబును తెలంగాణ ఏసీబీ విచారించకపోవడాన్ని ఈ తరం యువత కూడా చూసింది.
అయితే నారాయణ చేసిన వ్యాఖ్యల మాదిరిగా జరిగిన పరిస్థితులు లేవనే చెప్పాలి. అందుకే సాధారణ ప్రజలు నారాయణ వ్యాఖ్యలపై ఆశ్చర్యపోతున్నారు. సుప్రిం కోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి, తొలగింపునకు ప్రత్యేకమైన విధానం అమలులో ఉంది. నిర్థిష్ట అర్హతలు ఉన్న వారిని సుప్రిం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారు. పదవి విరమణ చేయడమో లేదా రాజీనామా చేయడం ద్వారా న్యాయమూర్తులు ఆ పదవి నుంచి వైదొలుగుతారు. లేదంటే కొలీజియం సిఫార్సు మేరకు బదిలీ అవుతారు. ఒక వేళ అవినీతి ఆరోపణలు, నిబంధనల మేరకు పని చేయలేదనే కారణాల నేపథ్యంలో తొలగించాలంటే.. పార్లమెంట్‌లో 2/3 వంతు మెజారిటీ సభ్యుల ఆమోద తీర్మానంతో రాష్ట్రపతి తొలగిస్తారు. ఇది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ.
న్యాయమూర్తుల నియామకం పూర్తిగా సుప్రిం కోర్టు పరిధిలోని అంశం. ఇందులో రాజకీయ జోక్యానికి తావేలేదు. సుప్రిం కోర్టు కొలీజియం స్థానంలో న్యాయమూర్తుల ఎంపిక అంశాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలని మొదటి సారి సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సుప్రిం కోర్టు తనకున్న అధికారాన్ని వదులుకునేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రిం కోర్టుకు మధ్య వివాదం కూడా నడిచింది.
ఓ వైపు వైఎస్ జగన్ జస్టిస్ ఎన్‌వీ రమణపై అక్రమ వ్యవహారాలపై బహిరంగంగా సుప్రిం కోర్టు సీజేకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ హాయంలో పెట్టిన కేసులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. ఈ కేసులలో జగన్‌కు శిక్ష పడుతుందంటూ టీడీపీ నేతలు తరచూ జోస్యం చెబుతున్నారు. సీఎం హోదాలో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసుల నుంచి బయటపడేందుకే అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయించే శక్తి, లాబీయింగ్ జరపగలిగిన మానవ వనరులు జగన్ వద్దనే ఉంటే.. టీడీపీ నేతలు చెబుతున్నట్లు.. కేసుల నుంచే బయటపడే వారేగా..? పైగా అవన్నీ కక్ష సాధింపు నేపథ్యంలోనే పెట్టిన కేసులు కాబట్టి మరింత సులువు అవుతుంది. మరి నారాయణ ఈ మాత్రం కూడా ఆలోచించకుండా విమర్శలు చేశారా..? అన్నదే సామాన్యుల్లో కలుగుతున్న సందేహం. పావుగా మారే క్రమంలోనే నారాయణ ఈ వ్యాఖ్యలు చేసుంటారనే వారు లేకపోలేదు. ఏమైనా లోగొట్టు నారాయణకే ఎరుక.
Read Also : వడివడిగా అడుగులు.. లక్ష్యం వైపు సీఎం జగన్..