పాక్ మాజీ క్రికెటర్ కు కరోనా

  • Updated - 07:45 PM, Fri - 29 July 22
పాక్ మాజీ క్రికెటర్ కు కరోనా

పాకిస్తాన్ క్రికెట్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని షాహిద్ ఆఫ్రిదినే ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు.

కాగా పాకిస్థాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో షాహిద్ ఆఫ్రిది ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. పేదలకు నిత్యావసర వస్తువులు, సరుకులను షాహిద్ ఆఫ్రిది పంపిణీ చేసాడు. ఆయన చేసిన సేవలను పలువురు ప్రశంసించగా భారత క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌సింగ్‌ కూడా ఆఫ్రిది దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆఫ్రిదికి కరోనా సోకడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

పాకిస్తాన్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇప్పటికే 1,32,405 మంది కరోనా బారిన పడగా 88 మంది మృతి చెందారు.పాకిస్థాన్‌ క్రికెటర్లలో కరోనా బారిన పడిన రెండో వ్యక్తిగా ఆఫ్రిది నిలిచాడు . కొద్దిరోజుల ముందు పాకిస్థాన్ మాజీ ఓపెనర్‌ తాఫిక్‌ ఉమర్‌ కూడా కరోనా బారినపడి కోలుకున్నాడు.. కాగా త్వరగా కరోనా బారినుండి కోలుకోవాలని అభిమానులను ప్రార్ధించమని ఆఫ్రిది అభిమానులను కోరాడు.ఆఫ్రిది తన కెరీర్‌లో మొత్తం 398 వన్డేలు, 27 టెస్టులు, 99 టీ20లు ఆడగా 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా భారత్ పై అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్ గా వెలుగులోకి వచ్చిన ఆఫ్రిది కొన్నేళ్ల పాటు ఆ రికార్డును కాపాడుకున్నాడు. ఆఫ్రిది నెలకొల్పిన ఫాస్టెస్ట్ రికార్డును న్యూజిలాండ్ బాట్స్మెన్ కోరే అండర్సన్ 18 సంవత్సరాల తర్వాత అధిగమించగా అండర్సన్ నెలకొల్పిన రికార్డును డివిలియర్స్ అధిగమించాడు.

Show comments