వెంకన్న దర్శనాలపై మళ్లీ కరోనా ప్రభావం

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. మొదటి వేవ్‌ కన్నా.. ఈ సారి పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజు వారీ కేసులు మూడు లక్షల వైపునకు పరిగెడుతున్నాయి. ఏపీలోనూ కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం రోజు వారీగా ఏడు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ కట్టడిపై సమాలోచనలు చేస్తోంది. నైట్‌ కర్ఫ్యూను విధించాలని సర్కార్‌ యోచిస్తోంది.

లాక్‌డౌన్‌ కాకుండా.. కరోనా కట్టడికి అనేక ఆంక్షలు పెట్టాలని జగన్‌ సర్కార్‌ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది అమలు చేసిన ఆంక్షలను మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. ప్రజలు భారీగా గూమిగూడే ప్రదేశాలపై ఆంక్షలు పెడుతోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి దర్శనాలపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే సర్వదర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. మే 1వ తేదీ నుంచి ప్రత్యేక దర్శనాలను సగానికి పరిమితం చేసింది. 300 రూపాయల దర్శన టిక్కెట్ల ద్వారా ప్రస్తుతం 30 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండగా.. ఈ సంఖ్యనే వచ్చే నెల 1వ తేదీ నుంచి 15 వేలకు పరిమితం చేయనున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది చర్రితలో తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మూసివేశారు. స్వామి వారికి కైంకర్యాలు మాత్రమే నిర్వహించారు. లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు తిరుమల ఆలయం మూసివేసే ఉంది. విడతల వారీగా ఆన్‌లాక్‌లో భాగంగా దాదాపు రెండు నెలల తర్వాత ఆగస్టులో తిరుమలలో భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. ప్రారంభంలో రోజుకు మూడు వేలు చొప్పన భక్తులను అనుమతించిన టీటీడీ ఆ తర్వాత ఈ సంఖ్యను ఆరువేలకు పెంచింది. ఆ తర్వాత భక్తుల సంఖ్యపై పరిమితి ఎత్తివేస్తూ.. నిర్ణయాలు తీసుకుంది. మళ్లీ కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో.. ఆంక్షలు విధిస్తోంది.

Also Read :  మాజీ సీఎంకు క‌రోనా : ఆస్ప‌త్రిలో బెడ్ క‌రువు

Show comments