మహిళల అభ్యున్నతే లక్ష్యం : సీఎం వైఎస్‌ జగన్‌

తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థితి కల్పించే లక్ష్యంతో ప్రతి పథకాన్ని రూపొందించామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవతర్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రశంగించారు.

అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌కాపు నేస్తం, జగనన్న వసతి దీవెన వంటి అనేక పథకాల ద్వారా నేరుగా డబ్బులు మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వీటికి అదనంగా లక్షల రూపాయలు విలువైన ఇళ్ల స్థలాలు కూడా మహిళల పేరిటే అందిస్తున్నామని వివరించారు. రాజకీయ నియామకాల్లో మహిళలకు 50 శాతం పదవులు దక్కాలనే లక్ష్యంతో చట్టాలు చేశామని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్లు/ఇళ్ల పట్టాలను పేదలకు అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తన పాదయాత్రలో ఎందరో పేదలను పూరి గుడిసెల్లో చూశానని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. వీరందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రణాళికలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. చెప్పిన దాని కన్నా 31 లక్షల పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలను ఇస్తున్నామని సీఎం జగన్‌ గర్వంగా చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ కూడా చూడకుండా అర్హత ఆధారంగా ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. ఒక బాధ్యతగా పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో మొదటి దశలో 1,78,888 ఇళ్లు కట్టబోతున్నామని సీఎం జగన్‌ చెప్పారు. ఊరందుకూరు లే అవుట్‌లో 6,232 మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. మార్కెట్‌ ధర ప్రకారం ఇక్కడ సెంటు ఏడు లక్షల రూపాయలు ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఏడు లక్షలు ఉన్న స్థలం ఒక అన్నగా, తమ్ముడిగా అక్కా చెళ్లెమ్మలకు ఇవ్వడం కన్నా ఆనందం ఏముటుందని సీఎం జగన్‌ ఉద్వేగంగా అన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైనా అర్హత ఉండి ఇళ్ల స్థలం రాకపోతే.. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారి అర్హతలు తనిఖీ చేసి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని, ఇది నిరంతరం సాగుతుందని సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు.

Show comments