iDreamPost
android-app
ios-app

CM YS Jagan, Aditya Birla Unit, Pulivendula – పులివెందులలో ప్రతిష్టాత్మక కంపెనీ.. శంకుస్థాపన చేసిన సీఎం

CM YS Jagan, Aditya Birla Unit, Pulivendula – పులివెందులలో ప్రతిష్టాత్మక కంపెనీ.. శంకుస్థాపన చేసిన సీఎం

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల ఇండస్ట్రియల్‌ పార్క్‌లో మరో ప్రతిష్టాత్మక కంపెనీ కొలువుతీరింది. దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం ఆదిత్యా బిర్లా గ్రూప్‌ పులివెందులలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ యూనిట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేశారు. 110 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ వస్త్ర తయారీ కంపెనీ ఏర్పాటు కాబోతోంది. దీని ద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం వైఎస్‌ జగన్‌.. కంపెనీ విజయవంతంగా నడిచేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని కంపెనీ ఎండీ ఆశీష్‌ దీక్షిత్, కుమార మంగళం బిర్లాలకు హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఆదిత్యా బిర్లా కంపెనీ పులివెందులలో ఏర్పాటు కావడంపై సీఎం వైఎస్‌ జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ పులివెందులలో ఆదిత్యా బిర్లా వస్త్ర ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టం. ఫార్చూన్ 500 కంపెనీల్లో ఆదిత్యా బిర్లా కంపెనీ ఒకటి, ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చే సంస్థగా ఆదిత్యా బిర్లా కంపెనీకి ఫోబ్స్‌ జాబితాలో చోటు దక్కింది. దేశ వ్యాప్తంగా ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. పెద్ద బ్రాండ్లు ఆదిత్యా బిర్లా గ్రూప్‌ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఇలాంటి మంచి కంపెనీ పులివెందుల గడ్డమీదకు రావడం సంతోషం. రెండువేల మందికి ఉద్యోగాలు కల్పించే స్థితి నుంచి కంపెనీ ప్రారంభమవుతోంది. ఇది 10 వేల ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిలషించారు.

మానవవనరులు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా.. ప్రతి పార్లమెంట్‌ జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. పులివెందులలో ఆ కాలేజీని ఏర్పాటు చేశామని, ఈ కాలేజీలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆదిత్యా బిర్లా ప్రతినిధులను సీఎం కోరారు. మానవ వనరులకు పులివెందులలో కొరత లేదని సంస్థ యాజమాన్యానికి సీఎం జగన్‌ చెప్పారు. తన నియోజకవరమైన పులివెందులలో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఆదిత్యా బిర్లా గ్రూప్‌ యాజమాన్యానికి జగన్‌ ధన్యవాదాలు తెలిపారు.

Also Read : ప్రతిపాదిత కార్యనిర్వాహక రాజధానిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు