ఇద్దరు స్టార్లకు చిరునే గెస్టు – Nostalgia

ఇక్కడ ఫోటోలో మూడు బాషలకు చెందిన ముగ్గురు స్టార్లు ఉన్నారు. తెలుగు చిరంజీవి, తమిళ రజినీకాంత్, కన్నడ రవిచంద్రన్. ఈ కలయిక రాజా విక్రమార్క సినిమా ఓపెనింగ్ సందర్భంగా తీసుకున్నది. ఇందులో అంతకు మించి ప్రత్యేకత ఏమి లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అది కూడా చిరుకి కనెక్షన్ ఉన్నది. అదేంటంటే రజినీకాంత్, రవిచంద్రన్ నటించిన రెండు బ్లాక్ బస్టర్స్ లో చిరు స్పెషల్ క్యామియో చేయడం. మొదటిది రజని మాపిల్లై. 1989లో విడుదలైన ఈ చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు రీమేక్. అల్లు అరవిందే నిర్మాత.

ఆ కారణంగా కీలకమైన మ్యారేజ్ ఎపిసోడ్ లో చిరు ఎంట్రీ ఉంటుంది. ఓ ఫైట్ పెట్టారు. బాగా క్లిక్ అయ్యింది కూడా. తర్వాత దీన్నే ఆంధ్రా అల్లుడు పేరుతో ఇక్కడా డబ్బింగ్ చేసి వదిలారు. అంతకు ముందే రజని, చిరు కలిసి బందిపోటు సింహం(డబ్బింగ్ టైటిల్), కాళీ సినిమాల్లో కలిసి ఫుల్ లెన్త్ రోల్స్ లో నటించారు. రజిని మాత్రం ఇలా స్పెషల్ రోల్ చిరు మూవీ లో చేయలేదు. ఇక 1996లో రవిచంద్రన్, సౌందర్య జంటగా కన్నడలో సిపాయి వచ్చింది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో చిరంజీవి మేజర్ చంద్రకాంత్ గా కాసేపు కనిపిస్తారు. రెండు ఫైట్లు రెండు పాటలు కూడా పెట్టారు. ఇదీ పెద్ద హిట్టే. తెలుగులో మేజర్ పేరుతో డబ్ చేశారు కానీ ఇక్కడ అంతగా ఆడలేదు. మ్యూజికల్ గానూ గొప్ప హిట్ అయిన సిపాయిలో రవిచంద్రన్ తో ఉన్న స్నేహం కారణంగానే అప్పట్లో ఆ పాత్రకు ఒప్పుకున్నారు.

కానీ రవిచంద్రన్ కు చిరు తెలుగు సినిమాలో ఇలా చేసే అవకాశం రాలేకపోయింది. ఇలా ఈ ఇద్దరు హీరోలకు ఒకే తరహా పాత్రలో గెస్ట్ గా నటించి రెండూ సూపర్ హిట్స్ కొట్టడం చిరు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వీళ్ళ మధ్య స్నేహం అలాగే ఉంది. రవిచంద్రన్ మనవాళ్లకు అంతగా సుపరిచితుడు కాదు. అప్పుడెప్పుడో ఒక్క ప్రేమలోకం మాత్రమే ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడింది. ఆ తర్వాత ఇంకే చిత్రాలు అనువాదం రూపంలో తెలుగులో రాలేదు. కాని రజినీకాంత్ ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి అరుదైన జ్ఞాపకాలు అలా అభిమానులను టైంతో పాటు వెనక్కు తీసుకెళ్లి కాలప్రయాణం చేయిస్తాయి.

Show comments