ఏ వేదికెక్కినా.. ఎందు కాలిడినా.. బాబు తీరు అంతేనా..!

ఏ దేశమెగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతినీ.. అన్నారు రాయప్రోలు సుబ్బారావు. ఏ వేదికెక్కినా.. ఎందు కాలిడినా.. నన్ను నేను పొగుడుకుంటాను అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. బాబు తీరు ఒకేలా ఉంటుంది. తన హాయంలో జరిగినవి, జరగనవి.. అన్నీ తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకు ఓ అలవాటు. ఇది శాశ్వతం అని అంతర్జాతీయ బిజినెస్‌ ఫెస్టివల్‌ అనే కార్యక్రమంలో భాగంగా ఐఐటీ ముంబై విద్యార్థులతో ముచ్చటించిన బాబు మరోసారి రుజువు చేశారు.

ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏదైనా సరే బాబు మాత్రం తన సొంత డబ్బా కొట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. ఐఐటీ విద్యార్థులతో మాట్లాడిన బాబు.. తన హాయంలో సైబరాబాద్‌ కట్టానని చెప్పుకొచ్చారు. ఐటీ కంపెనీల కోసం ప్రపంచం అంతా తిరిగానన్నారు. అంతేకాదు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి రూట్‌ మ్యాప్‌ తయారు చేశానని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో 15.48 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానని చెప్పుకున్నారు. పరిశ్రమల అభివృద్ధిలో దేశ వృద్ధి రేటు 7 శాతం అయితే ఏపీ వృద్ధి రేటు 15 శాతమని చెప్పుకొచ్చారు. ఇక వ్యవసాయంలో గణనీయమైన వృద్ధి సాధించామని చెప్పారు. రెండంకెల వృద్ధి సాధించామని బాబు తన పాలనలో సాధించామనుకుంటున్న ఘనతను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని విధంగా వ్యసాయంలో రెండంకెల వృద్ధి సాధించామని చెప్పుకున్నారు. 17 శాతం వృద్ధితో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చామని చెప్పుకొచ్చారు.

ఇలా రాసుకుంటూ పోతే.. బాబుగారు తన గురుంచి తాను చెప్పుకున్న గొప్పలు చాలానే ఉన్నాయి. 15.48 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమల్లోనూ, వ్యవసాయంలో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తే.. 2019 ఎన్నికల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారనే సందేహం ఐఐటీ విద్యార్థులకు తప్పక వచ్చే ఉంటుంది. కేవలం ప్రసంగం కాబట్టి సరిపోయింది.. ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటే.. ఇంత చేసిన మీరు ఎలా ఓడిపోయారని విద్యార్థులు అడిగినా ఆశ్చర్యం లేదు. అనుకూల మీడియా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగదాయే.. కానీ విద్యార్థులకు ఆ అవకాశం వస్తే వదిలిపెట్టరు కదా..? ఏమైనా ప్రశ్నోత్తరాలు లేకపోవడం బాబుకు ప్రతి చోటా కలిసివస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.

Show comments