వచ్చినా ఉపయోగం లేదా..?

కోవిడ్‌ పేరు చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీకేడర్‌కు దూరంగా ఏడు నెలలో పక్కరాష్ట్రానికి కాపురమెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ పార్టీకి నేరుగా దిశానిర్దేశం లేక కేడర్‌ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ఇటీవలే విజయావాడకు చేరుకున్నారు. అయినప్పటిక్కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలను నేరుగా కలిసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదట. దీంతో పెద్దాయనొస్తారు.. కుమ్మేద్దాం.. అనుకున్న కేడర్‌ నీరసించిపోతోందంటున్నారు. దీనికితోడు ఇక్కడ్నుంచి కూడా జూమ్‌ మీటింగ్‌లోనే చంద్రబాబు మాట్లాడుతూ పలు ఆదేశాలు కూడా ఇచ్చేస్తున్నారట.

ముఖ్యంగా తన రాజధాని అమరావతి పోరాటానికి మద్దతుగా ప్రతి నియోజకవర్గాలో అవిచెయ్యండి.. ఇవి చెయ్యండి అంటూ షెడ్యూల్‌ను ప్రకటించారట. ఊళ్ళోకొచ్చినా పోరాడ్డానికి ఆయనొస్తారో? లేదో? చెప్పకుండా కేడర్‌పై బరువుబాధ్యలు మోపడం పట్ల సొంత పార్టీనేతలే మీనమేషాలు లెక్కిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అమరావతే రాజధానిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసేసింది. అదే తీర్మానానికి కట్టుబడి ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని టీడీపీ నాయకులపై కూడా ఒత్తిడి తెస్తోంది. ఈ ధోరణి నచ్చక ఉత్తరాంద్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి టీడీపీ నాయకులు జారిపోతున్నారు. అయినప్పటికీ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఇంకా అమరావతి పోరాటం అంటూ చంద్రబాబు మరోసారి పిలుపునివ్వడం, అన్ని ప్రాంతాల వారిని అందులో భాగస్వాములు కావాలని ఆదేశాలివ్వడమే సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఆక్షేపణలు కారణమవుతోంది.

ఒక వేళ పార్టీ ఆదేశించినట్టు అమరావతికి అనుకూలంగా ఆందోళనలు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్‌ ఉంటుందోనన్న శంక అక్కడి నాయకులను పట్టిపీడిస్తోందట. చంద్రబాబు మాటవిని తీరా రోడ్డెక్కాక ప్రజల నుంచి స్పందన లేకపోగా, వ్యతిరేక వ్యక్తమైతే ఉన్న పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయానికి వారొస్తున్నట్టు తెలుస్తోంది.

జనంలో ఉండేందుకు ఏదో ‘‘కర్రా విరక్కుండా, పామూ చావకుండా..’’ అధినేత ధోరణిలోనే పోరాడమంటే పోరాడతాం గానీ.. ఇలా నేరుగా జనం ముందుకు ఒకే ప్రాంతానికి మద్దతుగా పోరాటాన్ని తీసుకువెళితే వచ్చే పరిణామాలకు ఎవరు బాధ్యులు అన్న సందేహాల మధ్య టీడీపీ కేడర్‌ ఊగిసలాడుతోందంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికొస్తే పార్టీ పరంగా తమ సమస్యలు నేరుగా వింటారేమోనని ఆశపడ్డామని, ఇక్కడకొచ్చి కూడా జూమ్‌ ద్వారాను, పైగా నాయకులు ఇబ్బందులు పడే టాస్క్‌లు ఇస్తున్నారేంటబ్బా.. అని తలలు కొట్టుకుంటున్నారట.

Show comments