Idream media
Idream media
ప్రజల తీర్పును శిరసా వహిస్తాం.. ఓటమికి గల కారణాలను తెలుసుకుని అధిగమిస్తాం.. భవిష్యత్ లో మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తాం.. ఇదీ సాధారణంగా ఏ పార్టీ అయినా ఓడిపోతే చెప్పే మాటలు. అందరిలా తానూ ఉంటే ఎలా అనుకున్నారో ఏమో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందన వింతగా ఉంది. తాను ఓడిపోవడానికి గల కారణాలపై మాట్లాడకుండా వైసీపీకి ఐదు లక్షల మెజారిటీ రాకపోవడం ఆనందంగా ఉందట. మరో విచిత్రం ఏంటంటే.. తిరుపతి ఎన్నికలో ఓటింగ్ శాతం తగ్గడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు అద్దం పడుతోందట. ఓటింగ్ శాతం పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత అంటారు.. కానీ, ఇదేందో బాబుగారు కొత్త అర్థాలు చెబుతున్నారు. వరుసగా ఓటములు చవిచూస్తున్నా చంద్రబాబులో మార్పు కనిపించకపోవడంపై చర్చనీయాంశంగా మారుతోంది.
అధినేత చంద్రబాబు నాయుడు అలా ఉంటే.. పోటీ చేసిన ఓడిపోయిన పనబాక లక్ష్మి ఏకంగా ఓటర్లపైనే నోరు పారేసుకున్నారు. ఓటర్లను అవమాన పరిచేలా మాట్లాడారు. ఫలితాలు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీకి ఓటు వేసిన వారే నిజమైన ఓటర్లని, వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారు కాదని చెప్పారు. కౌంటింగ్ కేంద్రం నుంచి తాను పారిపోయినట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 11 లక్షలకు పైగా ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార పార్టీకి సగానికిపైగా అంటే 56.67 శాతం ఓట్లు వచ్చాయి. తెలుగుదేశానికి పార్టీకి కేవలం మూడు లక్షల పైగా ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన పనబాక పేర్కొన్నట్లుగా దాదాపు 7 లక్షల మంది ఓటర్లే కాదన్నట్టు. దీంతో ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఇందుకు కాదు ఆమెను మరోసారి తిరుపతి ఓటర్లు తిరస్కరించింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చంద్రబాబు సహా టీడీపీ ప్రముఖులందరూ రోజుల తరబడి ప్రచారం చేసినా తిరుపతి ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినవి అత్తెసరు మార్కులే. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 37 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 5 శాతం ఓట్లు తగ్గి కేవలం 32 % ఓట్లే వచ్చాయి. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రిగా ఉండి వరుసగా రెండో సారి పోటీ చేసిన పనబాక లక్ష్మి వరుసగా ఘోర పరాజయం పాలయ్యారు. అయితే.. దీనిపై ఆత్మ విశ్లేషణ విచారణ చేసుకోవాల్సిన చంద్రబాబు ఆయన పరివారం.. మరోసారి వైసీపీ కేంద్రంగా విమర్శలు మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీపైనే కాదు, ఓట్లు వేసిన ప్రజలపైనా విమర్శలకు దిగుతుండడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలిచిన వారికి సంతోషం. ఓడిన బాధ ఉండడం కూడా సహజమే. అంతమాత్రాన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలి కానీ, ఓటర్లపైనే విమర్శలకు దిగడం ఎంత వరకు సబబో వారికే తెలియాలి.