Tirupathi Rao
Tirupathi Rao
“రండి బాబు రండి.. చందమామపై కొత్త వెంచర్ అండి. అతి తక్కువ ధరకే ఇండివిడ్యూవల్ ప్లాట్లు. ఈస్ట్ ఫెసింగ్, వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయండి” ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. అయితే వీటిని చూసి చాలా మంది నవ్వుకోవచ్చు. కానీ, చందమామ మీద ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే చందమామ మీద ల్యాండ్ కొన్నవాళ్లు ఉన్నారు. అందులో సినిమా స్టార్లు కూడా ఉన్నారు. మరి.. చందమామపై ఎవరికి ఎంత భూమి ఉంది? చూద్దాం.
ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై పరిశోధనలు మొదలు పెట్టింది. అక్కడి పరిస్థితులు, నీరు, ఖనిజాలు, ఉపరితల వాతావరణం ఇలా అన్ని విషయాలపై ఇస్రో పరిశోధనలు చేయనుంది. ముఖ్యంగా చందమామపై మానవ మనుగడకు అవకాశం ఉంటుందా అనే విషయాన్ని కూడా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలోనే చందమామపై భూమి కొనేసి భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాలి అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, దివంగత నటుడు శుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు భూమి ఉంది. షారుక్ ఖాన్ కు చందమామ మీద ల్యాండ్ ఉన్న విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.
షారుక్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు చెందిన ఒక అభిమాని పుట్టినరోజు సందర్భంగా ఏటా తన పేరుపై కొంత భూమి కొనుగోలు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఏటా తనకి లూనా సొసైటీ ఇంటర్నేషనల్ నుంచి సంబంధిత సర్టిఫికెట్లు వస్తాయని చెప్పారు. అలాగే శుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా స్పేస్ మీద ఉన్న మక్కువతో చంద్రుడిపై ముస్కోవియన్స్ అని పిలిచే ప్రాంతంలో రూ.55 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. జూన్ 25, 2018న ఆ ప్రాంతాన్ని అతని పేరుపై రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు. చంద్రునిపై భూమికొన్న మరికొంతమంది ఎవరంటే.. జోధ్ పూర్ ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ తన ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే లూనా ఇంటర్నేషనల్ ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా చూపించారు. అజ్మీర్ ధర్మేంద్ర అనిజా తన పెళ్లిరోజు సందర్భంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రుడిపై 3 ఎకరాల భూమిని బహూకరించాడు.
20 ఏళ్ల క్రితమే చంద్రుడిపై భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. రాజీవ్ వి బగ్ధి 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాల భూమి చంద్రుడిపై కొనుగోలు చేశాడు. 2003లో కేవలం 140 డాలర్లకే ప్లాట్ కొనుగోలు చేశారు. న్యూయార్క్ లో ఉన్న లూనార్ రిజిస్ట్రీ ద్వారా రాజీవ్ 2003, జూలై 27న భూమిని రిజిస్ట్రర్ చేయించుకున్నారు. 2030 నుంచి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ మీరు భూమి తీసుకున్నా దానిపై యాజమాన్య హక్కులు మాత్రం పొందలేరు. మీరు ఆ భూమిని క్లెయిన్ చేసుకోలేరు. 1967లో భారత్ సహా 104 దేశాలు ఇలా ఒప్పందం చేసుకున్నాయి. అలాగే సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి ఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. ఈ ఒప్పందం ప్రకారం మీరు చందమామపై స్థలం కొనేందుకు వీలు ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారి వెబ్ సైట్ ద్వారా మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న భూమిని ఎంచుకోవచ్చు. అయితే ప్రైవేట్ యాజమాన్యం కోసం మీరు ఈ భూమిని కొనుగోలు చేయలేరు.