Idream media
Idream media
జాతీయ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై ఛత్తీస్‌ఘడ్ రాయపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో,ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కమ్ లు అర్నాబ్ గోస్వామి తమ పార్టీ నాయకులపై రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల గురించి రాయపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై రాయపూర్ పోలీసులు ఐపీసీ 153 A, 295 A ,502 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.అర్నాబ్ గోస్వామి జర్నలిజం ముసుగులో విద్వేషపూరిత పుకార్లను ప్రచారం చేశారని,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడారని ఆయనను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ నితిన్ త్రివేది డిమాండ్ చేశారు.
అంతకుముందు ముంబైలోని స్టూడియో నుంచి అర్ధరాత్రి సమయంలో ఆర్నాబ్ గోస్వామి,అతని భార్య ఇంటికి వెళ్తుండగా ఇద్దరు అగంతకులు వారిపై దాడి చేశారు. గోస్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు ముందు బైక్ ఆపిన దుండగులు కారుపై నల్ల సిరా చల్లారు. ఈ దాడిలో ఆర్నాబ్ దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు.తమపై దాడికి సంబంధించి ఆర్నాబ్ ముంబైలోని ఎన్ఎంజోషి మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆయన ఫిర్యాదుపై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
రిపబ్లిక్ టీవీ ట్విటర్‌లో ఈ దాడి సంబంధించి ఆర్నాబ్ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది. ఇందులో తనపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ యూత్ నాయకులేనని అర్నాబ్ ఆరోపించారు.బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలకొట్టడానికి యత్నించారని తెలిపారు. తన ప్రాణాలకు హాని జరిగితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్,బిజెపి శ్రేణుల మధ్య ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.