దివికేగిన వెండితెర నట ‘ఋషి’

ఇండియన్ సినిమాకు కరోనా రూపంలోనే కాకుండా మరో విధంగానూ 2020 మర్చిపోలేని పీడకలగా మారుతోంది. నిన్న విలక్షణ నటులు ఇర్ఫాన్ ఖాన్ మృతిని ఇంకా జీర్ణించుకోకముందే మరో దిగ్గజం రిషికపూర్ కాలం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఇవాళ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో కన్నుమూశారు . ఎంతో అనుభవమున్న సీనియర్ నటుడిగా స్టార్ డం చవిచూసిన రిషి కపూర్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు.

1970లో నాన్న రాజ్ కపూర్ తీసిన మేరా నామ్ జోకర్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన రిషి కపూర్ దాని ద్వారా డెబ్యూతోనే గొప్ప పేరు సంపాదించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నట ప్రయాణం నిరంతరంగా కొనసాగింది. సోలో హీరోగా మారాక 1973లో వచ్చిన బాబీ చిత్రం రిషి కపూర్ కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమా కపూర్ వారసుడిని బిజీగా ఆర్టిస్ట్ గా మార్చేసింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ క్యూ కట్టాయి.

కభీ కభీ, దూస్రా ఆద్మీ, అమర్ అక్బర్ ఆంటోనీ, బారూద్, లైలా మజ్ను, సర్గం, ప్రేమ్ రోగ్, కర్జ్, నసీబ్, కూలీ, దునియా ఇలా లెక్కలేనన్ని సూపర్ హిట్లతో అమితాబ్ లాంటి స్టార్లను సైతం ఢీకొని తన ఉనికిని చాటుకునేవారు. సల్మాన్ ఖాన్ లాంటి యువహీరోల తాకిడి మొదలైన సమయంలోనూ హెన్నా, బోల్ రాధా బోల్, దామిని లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తన స్టామినాను ఎప్పటికప్పుడు ఋజువు చేసుకుంటూనే వచ్చారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక కూడా ఫనా లాంటి గొప్ప సినిమాలు రిషి ఖాతాలో ఉన్నాయి. రాజ్ కపూర్ తర్వాత ఆ కుటుంబంలో అత్యంత సుదీర్ఘమైన కెరీర్ ని అనుభవించింది రిషీ కపూరే. షమ్మీ కపూర్ సైతం సినిమాల కౌంట్ పరంగా ఆయన తర్వాత స్థానంలో నిలుస్తారు. అమితాబ్ తో 2018లో చేసిన 102 నాట్ అవుట్ రిషిని ఎనర్జీని మరోసారి చాటి చెప్పింది. లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిన పరిస్థితిలో రిషి కపూర్ ని కడసారి చూసుకునే అవకాశం కూడా లేకపోవడం బాలీవుడ్ ప్రముఖులనే కాదు సగటు సినీ ప్రేమికులను కంటతడి పెట్టిస్తోంది.

Show comments