Idream media
Idream media
ఎంత సంపన్నులైనా ఆకలేస్తే అన్నం తినాల్సిందే. ఆ అన్నాన్ని సృష్టించేది రైతన్నే. అందుకే మానవాళి మనుగడకు మూలధారి కర్షకుడే అవుతాడంటారు పెద్దలు. ఇప్పుడు ఆ కర్షకలోకం కదం తొక్కుతోంది. రైతు ఉత్పత్తుల (ప్రోత్సాహక, సులభతర) వ్యాపార, వాణిజ్యచట్టం, రైతు ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం… మాకొద్దు అంటూ గళమెత్తుతోంది. కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రైతు పోరాటం నేడు భారత్ బంద్‌తో మరింత విస్తరించనుంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఈ బంద్ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాధినేతే మద్దతు ప్రకటించడంతో ఆసక్తి ఏర్పడింది. దీని వెనుక రాజకీయ కారణాలు ఎలాగున్నా రైతులకు ఇది మనోబలాన్ని ఇస్తుందని ప్రజా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
‘‘రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. టీఆర్‌ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారు’’ అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన బీజేపీపై యుద్ధం ప్రకటించినట్లుగా అనిపించినా రైతుల పోరాటానికి అది మేలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు భారత్‌బంద్ నాడు రహదారులను దిగ్బంధం చేస్తాం.. హైవేలపై ధర్నాలు చేస్తాం.. అని మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడి నేతలు అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో భారత్ బంద్ ప్రత్యేకంగా మారింది. ఓ రకంగా ప్రభుత్వమే మద్దతు తెలపడంతో ఆసక్తిగా మారింది. సాధారణంగా బంద్‌లు, ఆందోళనలకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా మాట్లాడతాయి. కానీ భారత్ బంద్‌కు కేసీఆర్ సహా, మంత్రులు అందరూ మద్దతు ప్రకటించారు.
నగరంలో నిరసన ప్రదర్శనలు
భారత్ బంద్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించబోయే బైకు ర్యాలీలను స్వయానా మంత్రులే ప్రారంభించనున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించారు. రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నేడు నిర్వహించే భారత్‌బంద్‌లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. దీంతో నేతలు, కార్పొరేటర్లు ఆయా ప్రాంతాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నుంచి రెండువేల బైక్‌లతో ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ ప్రారంభించనున్నట్లు మంత్రి కార్యాలయాల వర్గాలు తెలిపాయి. మోండా జనరల్‌బజార్, ప్యారడైజ్, బేగంపేట్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, యూసు్‌ఫగూడ, లక్డీకాపూల్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ర్యాలీలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొననున్నారు.