Idream media
Idream media
సాగు చట్టాలను రద్దు చేయాలని నాలుగు నెలలుగా నిరసన చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సాగు చట్టాల రద్దు కోరుతూ అన్నదాతలు మరోమారు భారత్ బంద్‌తో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఒకసారి భారత్ బంద్‌ను నిర్వహించిన అన్నదాతలు ఈ రోజు మరోమారు భారతావనిని స్తంభింపజేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు.. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చెరి, కేరళ మినహా.. మిగతా భారతావనిలో బంద్ జరుగుతోంది.
బీజేపీయేతర పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు మద్ధతుగా నిలిచాయి. సాగు చట్టాల రద్దుతోపాటు నిత్యం పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్‌ధరలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు బంద్ పాటిస్తున్నారు.
రైతులు, కార్మికులు చేస్తున్న బంద్ ఆంధ్రప్రదేశ్‌లో సంపూర్ణంగా జరుగుతోంది. బంద్‌కు వైసీపీ సర్కార్ మద్ధతు ప్రకటించడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం 1 గంటల తర్వాతనే బస్సులు రోడ్లమీదకు రానున్నాయి. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాలలో బంద్ విజయవంతంగా సాగుతోంది. బంద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.
బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాల వల్ల వ్యవసాయం కార్పొరేట్ వర్గాల పరం అవుతుందనే ఆందోళనతో రైతుల వాటిని రద్దు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద ఆందోళన చేస్తున్నారు. మొదట పంజాబ్ రైతులు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టగా.. ఆ తర్వాత ఇది హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాధి రాష్ట్రాల రైతులు భాగస్వాములయ్యారు.
పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీని ఆ రాష్ట్ర ప్రజలు ఘోరంగా ఓడించారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేయొద్దని రైతు సంఘాల నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీని గద్దె దించుతామని హెచ్చరిస్తున్నా.. బీజేపీ పెద్దలు మాత్రం సాగు చట్టాల అమలు కోసమే ప్రయత్నిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది.