బెంగాల్ బరిలో ఆడియో యుద్ధం

‘మమత ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది.. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది’.. అన్నమాటలతో కూడిన ఓ ఆడియో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. భారతీయ జనతా పార్టీ పోస్ట్ చేసిన ఈ ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరికొత్త రాజకీయ దుమారం రేపుతోంది.

తన ప్రధాన ప్రత్యర్థి అయిన టీఎంసీ ఓడిపోతుందని బీజేపీ ప్రచారం చేయడంలో వింతేముంది. ఎన్నికల్లో ఇటువంటి గేమ్ ప్లాన్లు మాములే కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. బీజేపీ పోస్ట్ చేసిన ఆడియో క్లిప్ లోని స్వరం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కోశోర్ ది. ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కావడమే ఇక్కడ విశేషం. తాను పనిచేసిన పార్టీయే ఓడిపోతుందని ఆయన చెప్పడమే ఇంత కలకలానికి కారణమైంది.

ప్రశాంత్ చాట్ ను ఎడిట్ చేశారట..

అయితే ప్రశాంత్ కిశోర్ బీజేపీ చర్యను ఖండించారు. క్లబ్ హౌసులో తాను జరిపిన చాటింగ్ ను బీజేపీ నేతలు తమకు అనుకూలంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వారికి ధైర్యం ఉంటే తన మాటల క్లిప్పింగ్ మొత్తాన్ని యథాతథంగా పోస్ట్ చేయాలని సవాల్ చేశారు. అప్పుడే అసలు విషయం వెల్లడవుతుందన్నారు.

‘రాష్ట్రంలో మోదీ పాపులారిటీ బాగా పెరిగింది. మమతా సర్కార్ పై దళితులు, మతువాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. పోలింగ్ సరళి చూస్తే మమత సర్కార్ ఓటమి ఖాయమనిపిస్తోంది’ అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్ ను బీజేపీ సోషల్ మీడియా విభాగం ఇంఛార్జి అమిత్ మాల్వియా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అది కూడా బెంగాల్లో నాలుగో విడత పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న తరుణంలో ప్రత్యక్షమైన ఈ ఆడియో టీఎంసీ వర్గాల్లో కలవరం రేపింది. అదే సమయంలో ఈ ఆడియో నిజమని నమ్మిన బీజేపీ శ్రేణులు మమత గేమ్ ఓవర్ అని నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

అయితే అది తమ పార్టీ ఎడిట్ చేసిన ఆడియో అని తేలడంతో చల్లబడిపోయారు. కాగా బీజేపీ గేమ్ ప్లాన్ పై ప్రశాంత్ కిశోర్ విరుచుకుపడ్డారు. ఎన్ని పాట్లు పడినా బెంగాల్లో బీజేపీ గెలవడం కల్ల అని స్పష్టం చేశారు. ఆ పార్టీ 100 సీట్లకు మించి సాధిస్తే రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తానని గతంలో తాను చేసిన సవాలును గుర్తు చేస్తూ.. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తృణమూల్ ప్రభుత్వం తనంతట తను పతనం అయితే తప్ప దాన్ని ఎన్నికల్లో ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు.

అధికారం కోసం హోరాహోరీ..

బెంగాల్లో వామపక్ష కోటలను కూలగొట్టి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2016 లోనూ అధికారం కాపాడుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆమె ముచ్చట తీరకుండా చేసి అధికారం కైవసం చేసుకోవాలని కమలదళం రెండేళ్ల నుంచీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో 2019 వరకు బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని 42 ఎంపీ స్థానాల్లో 18 చేజిక్కించుకోవడం బీజేపీలో కొత్త ఆశలు రేపింది. అప్పటినుంచి బెంగాల్లో ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. గవర్నర్ ద్వారా మమత సర్కారును పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ అమలుచేసి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా పెద్ద సంఖ్యలో తృణమూల్ నేతలను తన పార్టీలో చేర్చుకొని మమతకు సవాలు విసిరింది.

మమత కూడా అంతే ధీటుగా స్పందిస్తూ ఒంటరిగానే పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధంలో ముందుకురికిస్తుండటంతో బెంగాల్లో మహాసంగ్రామం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 294 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికి నాలుగు దశలు పూర్తి అయ్యాయి. ఇంకా నాలుగు విడతలు ఉన్నాయి. ఈ నెల 29న మొత్తం పోలింగ్ ముగుస్తుంది.

Also Read : నాలుగో దశలో హింస.. బెంగాల్లో రాజకీయ రగడ..

Show comments