iDreamPost
iDreamPost
సహజంగా ఎన్నికలు అంటే ఎవరు గెలుస్తారనే విషయంలో ఆసక్తి ఉంటుంది. కానీ బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు నల్లేరు మీద నడకలా మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థిని ప్రకటించి కూడా ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా మారింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బీజేపీ ఏపీలో నిలదొక్కకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగించుకోవాలని ఆశించింది. టీడీపీ పక్కకు తప్పుకోవడంతో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలని చూసింది. కానీ బద్వేలులో ఆపార్టీకి పునాది కూడా లేకపోవడంతో పేలవంగా ప్రచారం సాగిస్తోంది. పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం ఒక కేంద్ర మంత్రి అది కూడా పెద్దగా జనాలకు పరిచయం లేని నేతను పంపించి అధిష్టానం చేతులు దులుపుకుంది. ఇక సోము వీర్రాజు, జీవీఎల్, సునీద్ దియోదర్ తో పాటుగా సీఎం రమేష్ వంటి వారు ఎంతగా ప్రయత్నించినా అక్కడ డిపాజిట్ దక్కించుకోవడమే గగనం అన్నట్టుగా కనిపిస్తోంది.
టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆపార్టీ నేతల ఓట్ల కోసం బీజేపీ గాలం వేస్తోంది. కానీ అనేక చోట్ల బీజేపీకి పట్టం గట్టే బదులుగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేందుకే కొందరు సిద్ధం కావడం విశేషంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కమలమ్మ గతంలో పరిచయస్తురాలు కావడం, కుటుంబ బంధాలు కూడా ఉండడంతో ఆమె తన ఓటింగ్ నిలబెట్టుకోవాలని సంకల్పించుకుంది. అయితే బీజేపీకి కేంద్రంలో ఉన్న అధికారంతో ఉన్న అడ్వాన్స్ రీత్యా కొంత ప్రచారం సహా పలు వ్యవహరాలు సమర్థమవతంగా సాగిస్తోంది. అయినప్పటికీ రెండు జాతీయ పార్టీలు ఏపీ వ్యాప్తంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న దశలో బద్వేల్ ఓటర్లయినా వారిని కరుణిస్తారా అన్నది సందేహంగా కనిపిస్తోంది. కనీసంగా డిపాజిట్ దక్కించుకుంటారా అన్నది చూడాలి.
అదే సమయంలో అధికార పార్టీ పూర్తిగా స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యతనిస్తూ ప్రచారం నడుపుతోంది.మంత్రులు పెద్దిరెడ్డి వంటి వారు కీలకంగా వ్యవహరిస్తున్నా స్థానిక నేతలే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. దివంగత వెంకటసుబ్బయ్య మరణంతో ఉన్న సానుభూతి, డాక్టర్ సుధమ్మకు మెజార్టీ పెంచాలని వైఎస్ జగన్ పిలుపు పనిచేస్తాయని ఆశిస్తున్నారు. బద్వేల్ లో ఆర్డీవో కార్యాలయం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో స్థానికుల్లో ప్రభుత్వానికి ఆదరణ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో బద్వేలు ఫలితాల కన్నా మెజార్టీల మీద పందాలు కాసే బ్యాచులు మొదలయ్యాయి. కేవలం బద్వేల్ లో మాత్రమే గాకుండా ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మెజార్టీ మీద చర్చలు సాగుతున్నాయి. ఈనెల 30న పోలింగ్ జరగబోతున్న తరుణంలో ప్రభుత్వానికి సానుకూల వాతావరణం సొమ్ము చేసుకుని మెజార్టీ అర లక్ష దాటిపోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దాంతో పందెం రాయుళ్లు కూడా భారీ మెజార్టీల మీదే ఎక్కువగా సిద్ధపడుతుండడం విశేషం.
Also Read : By Polls Betting- బై పోల్స్ : అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!