iDreamPost
iDreamPost
టీడీపీ అధినేతకు ఏపీ మంత్రి కొడాలి నాని అనగానే కలవరం కలుగుతుంది. ఇది ఇప్పటిది కాదు. టీడీపీ ని వీడి జగన్ చెంత చేరేముందు చెలరేగిపోయిన నాని తీరు చూసిన నాటి నుంచి బాబుది అదే తీరు. చంద్రబాబు పేరు చెప్పగానే ఒంటికాలిపై లేస్తున్న నానిని కట్టడి చేయాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారు. చివరకు తాను అధికారంలో ఉండగా చేయాల్సినదంతా చేశారు. కానీ గుడివాడ ప్రజల్లో మాత్రం నాని ఇమేజ్ పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఇక ఇప్పుడు అన్నీ కావని నానిని నేరుగా ఎదుర్కొనే అవకాశం లేనందున మతం కోణంలో వివాదం రాజేసేయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ సందర్భంగా టీటీడీ డిక్లరేషన్ పై చంద్రబాబుని నాని పలు ప్రశ్నలు సంధించారు. టీడీపీ అధ్యక్షుడి నుంచి గానీ ఆ క్యాంప్ నుంచి గానీ వాటికి సమాధానాలు కనిపించడం లేదు. అందులో మొదటిది సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో జగన్ తిరుమల పర్యటకు వెళితే డిక్లరేషన్ ఎందుకు తీసుకోలేదు చెప్పాలని నాని అడుగుతున్నారు. కనీసం ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నారు. దానికి టీడీపీ నేతల దగ్గర సమాధానం కష్టమే అనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్ జనార్థన్ రెడ్డి, వైఎస్సార్ లు క్రైస్తవ మతాన్ని ఆచరించినా తిరుమలలో సంప్రదాయ బద్దంగా దర్శనాలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ తీసుకోలేదనే విషయం టీడీపీకి తెలుసా అంటున్నారు. కనీసం వాళ్లని ఎప్పుడయినా ప్రశ్నించారా అని నిలదీస్తున్నారు. ఎన్ జే ఆర్, వైఎస్సార్ కాలంలో కూడా లేని డిక్లరేషన్ జగన్ కి ఎందుకు అంటూ కొడాలి నాని నిలదీయడంతో టీడీపీ నేతలు నీళ్లు నమలాల్సి వస్తోంది.
అబ్దుల్ కలాం తనకు తానుగా తిరుమల దర్శనాలకు వచ్చారు. కానీ వైఎస్ జగన్ ని ప్రస్తుతం ఏపీ ప్రజల ప్రతినిధిగా సీఎం హోదాలో టీటీడీ ఆహ్వానిస్తే వెళుతున్నారు. సీఎంని డిక్లరేషన్ ని అడగడం ఏపీ ప్రజలందరినీ అవమానించడం కాదా అని కొడాలి నాని అంటున్నారు. ప్రజల పక్షాన స్వామి వారికి పూర్తి సంప్రదాయబద్ధంగా నామాలు పెట్టుకుని, పంచె కట్టుకుని వెళ్లి పట్టు వస్త్రాలు ఇస్తుంటే అభ్యంతరం పెట్టడం వెనుక చంద్రబాబు సహించలేని తనం తప్ప మరోటి లేదని నాని వ్యాఖ్యానిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా గత ఏడాది మోడీతో కలిసి తిరుమల దర్శనం చేసుకున్ననాడు అవసరం లేని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు అవసరమో బీజేపీ చెప్పాలని ఆయన అంటున్నారు. బీజేపీకి సంబంధించిన దేవాదాయ మంత్రి ఉన్న సమయంలోని లేని నిబంధన ఇప్పుడెందుకు అని అడుగుతున్నారు. ఇదంతా జగన్ మీద చంద్రబాబు కుట్ర చేస్తుంటే కేవలం ఆ వలలో పడిన బీజేపీ రాద్ధాంతం చేయడం ఏమిటన్నది నాని ప్రశ్న.
అన్నింటికీ మించి తిరుమలలో డిక్లరేషన్ అనేది కేవలం అబ్దుల్ కలాంకి తప్ప ఇంకెవరికైనా అమలు జరిగిందా.. అమలు సాధ్యమేనా.. ఇతర మతాల వాళ్లు స్వామి వారి మీద విశ్వాసంతో సంప్రదాయాలు పాటిస్తూ దర్శనాలకు వస్తే అడ్డుకోవడం సమంజసమేనా అనే అంశాలు టీటీడీ, ఇతర హిందూమత పెద్దలు ఆలోచించాలన్నదే తన అభిప్రాయం అని, చంద్రబాబులా రాజకీయం చేస్తే ఉన్న గౌరవం పోతుందని ఆయన అంంటున్నారు. అమలులోలేని డిక్లరేషన్ గురించి రాజకీయాలు కాకుండా, ప్రజా ప్రయోజనాల కోణంలో చర్చ జరగాలని తాను ఆశిస్తున్నట్టు కొడాలి నాని స్పష్టం చేశారు. దాంతో ఈ వ్యవహారంలో నాని ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం లేకపోవడంతో నిందించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తోంది.