పరిషత్‌ ఎన్నికల భవితవ్యం నేడు తేలుతుందా..?

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఘట్టం ముగిసింది. పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. గత ఏడాది మార్చిలో ప్రారంభమై వాయిదా పడిన పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో.. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలపై ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికలు ఎక్కడ ఆగాయో మళ్లీ అక్కడ నుంచే ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ, 3వ తేదీ సాయంత్రం తది జాబితా ప్రకటన, 10వ తేదీన పోలింగ్, 13వ తేదీన అవసరమైన చోట రీ పోలింగ్, 14న కౌటింగ్, ఫలితాల వెల్లడికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫెడ్యూల్‌ జారీ చేసింది. అయితే మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

నామినేషన్లు వేయకుండా బెదిరింపు, బలవంతపు ఉపసంహరణలు జరిగిన చోట.. మళ్లీ అవకాశం ఇస్తామని, సంబంధిత అభ్యర్థులు ఆధారాలతో కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాలు మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను వివాదాల్లోకి లాగాయి. ఏపీ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు ఎంపీటీసీలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని, ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించవచ్చని పిటిషన్‌దారులు కోర్టులో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు.. ఏపీ ఎస్‌ఈసీకి ఉన్న అధికారం ఏమిటిని ప్రశ్నించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎక్కడ నుంచి వచ్చిందంటూ ప్రశ్నిస్తూ.. ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏకగ్రీవమైనట్లు ఫాం – 10 జారీ చేసిన స్థానాలపై, జారీ చేయని స్థానాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని, ఒక వేళ ఇప్పటికే తీసుకున్న వెల్లడించకూడదని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ రోజు 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ అంశంపై మరోమారు ఏపీ హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఏపీ ఎస్‌ఈసీ తాను జారీ చేసిన ఆదేశాలను ఏ విధంగా సమర్థించుకుంటుందో చూడాలి.

పరిషత్‌ ఎన్నికలపై ఒకట్రెండు కోర్టు వివాదాలు ఉన్నాయని, అవి పరిష్కారం అయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిన్న మీడియాతో చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని భావించినట్లు ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ రోజు కోర్టులో ఎస్‌ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరోమారు కోర్టులకు వెళ్లే ఆలోచన లేనట్లుగా ఆయన వ్యవహారశైలి ద్వారా తెలుస్తోంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సంసిద్ధులయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీ హైకోర్టు.. విచారణను మళ్లీ వాయిదా వేస్తే తప్పా.. పరిషత్‌ ఎన్నికల భవితవ్యం ఈ రోజు సాయంత్రంతో తేలిపోనుంది.

Show comments