iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో మతోన్మాద పూరిత చర్యలకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత హిందువుల ఆలయాల్లో కొన్ని చోట్ల దాడులు,విగ్రహాలు ధ్వంసం వంటి వాటితో రాజకీయ ప్రయోజనాలు ఆశించారు. కానీ ప్రభుత్వం వేగంగా స్పందించడం, పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించడం,వ్యవహారం చేజారిపోకుండా నివారించారు. ఆయా ఘటనల ఆధారంగా విద్వేషం రగల్చాలని చూసిన వారికి చెక్ పెట్టారు. కానీ తాజాగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన పరిణామాలు మతోన్మాదం మరో రూపంలో ముంచుకొస్తుందనే సూచనలు అందిస్తోంది. ఈ ప్రమాదం పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చాటుతోంది.
కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఏడాదికాలంగా సాగుతున్న వివాదంలో బీజేపీ నాయకుడి జోక్యం వివాదాన్ని తీవ్రం చేసింది. స్థానికంగా ఉన్న సమస్యను అంతటితో పరిష్కరించకుండా దానికి మతం రంగు పులిమి పెంచాలనే ప్రయత్నంలో కొందరు అగ్గిరాజేయడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యింది. దానిపై సకాలంలో ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి పరిణామాలు సహించేది లేదంటూ డీజీపీ హెచ్చరించారు. ఈ ఘటనకు కారకులందరిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఘటనాస్థలంలో పర్యటించారు. మంత్రి అంజాద్ భాషా తో పాటుగా ఇతర నేతలు కూడా పరిస్థితిని పర్యవేక్షించారు.
ఇటీవల ఏపీలో వరుసగా గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాలి, కేజీహెచ్ పేరు మార్చాలి అంటూ బీజేపీ నేతలు కొంత ఉద్రిక్తత పెంచే యత్నంలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కూడా రాష్ట్రంలో జరిగిన సమావేశాలకు హాజరయిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ స్వరం పెంచింది. దానికి కొనసాగింపుగానే ఆత్మకూరు ఘటనలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. అయితే ఏపీలో మతాలతో ప్రమేయం లేకుండా సామరస్య వాతావరణం చాలాకాలంగా ఉంది. మతోన్మాదం పెంచడానికి అనేక మంది ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం వేగంగా కదలడంతో ఆత్మకూరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా పోలీసు, నిఘా యంత్రాంగాలు మరింత పగడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆత్మకూరు చాటుతోంది.