iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. దివీస్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఒంటెద్దు పోకడతో ముందుకెళ్ళే ప్రభుత్వం తమది కాదని నిరూపించింది. ప్రజల అభ్యంతరాలు , సందేహాల నివృత్తి జరిగే వరకూ ‘దివీస్’ ఒక్క ఇటుక కూడా కదపకూడదు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దానికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో దివీస్ పరిశ్రమ చుట్టూ అలముకున్న అంశాలన్నీ పరిష్కరించిన తర్వాతే ముందడుగు పడుతుందని తేల్చిచెప్పారు.
దివీస్ పేరుతో కాకినాడ సెజ్ ని ఆనుకుని తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటు కోసం 2015లో చంద్రబాబు ప్రభుత్వం అనుమతిన్చింది. 540 ఎకరాలను స్వల్ప ధరకే ఏపీఐఐసీ ద్వారా కట్టబెట్టింది. కానీ పరిశ్రమ ఏర్పాటుని స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఉద్యమం సాగింది. ఆసమయంలో వారికి ప్రతిపక్ష హోదాలో జగన్ కూడా సంఘీభావం ప్రకటించారు. దివీస్ కార్మాగారం కోన ప్రాంతంలో ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పరిశ్రమ నిర్మాణం జరగలేదు.
తాజాగా దివీస్ యాజమాన్యం ప్రభుత్వంతో మంతనాలు జరిపింది. సముద్ర జలాల కాలుష్యం లేకుండా జీరో డిశ్చార్జ్ ప్రాతిపదికన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దానికి ప్రభుత్వం అంగీకరించడంతో పరిశ్రమలో మళ్లీ పనులకు ప్రయత్నాలు జరగాయి. దాంతో మరోసారి స్థానికులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించుకుంది. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ నిర్మాణానికి ప్రతిపాదనపై ముందుకెళతామని తేల్చిచెప్పింది. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలన్నింటిపై ‘దివీస్’ యాజమాన్యంతో చర్చించిన పరిశ్రమల శాఖ మంత్రి దానికి అనుగుణంగా ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వాటికి ప్రత్యామ్నాయం, పరిష్కారాలకు చొరవ చూపాలని ఆదేశించారు.
దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు:
1.దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి
2.కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.
3.దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు
4.దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి
5.సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి
దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున ‘నైపుణ్య’ సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించింది. కంపెనీ డైరెక్టర్ కిరణ్ దివి ఈ మేరకు హామీ ఇచ్చారు. సీఎస్ ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు. దాంతో పాటుగా సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశలో అడుగులు వేసేందుకు దివీస్ కూడా సిద్ధం కావడంతో ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా చెప్పాలి. మరోసారి సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసినట్టుగా ఉంది.