మే చివరిలో ఉద్యోగ క్యాలెండర్

ఉద్యోగుల కల సాకారం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కసరత్తు ప్రారంభమైంది.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్‌ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను, అవసరమైన పోస్టుల భర్తీ వివరాలను డైరెక్టరీ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ విభాగంలో నమోదు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని స్పష్టం చేశారు. ఆ లెక్కలు ఆధారంగా అవసరమైన పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా క్యాలెండర్‌ రూపొందించి మే చివరలో విడుదల చేస్తారని చెప్పారు. గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను గుర్తించి భర్తీ చేయనున్నారు.

అధికారం చేపట్టిన మొదటి 5 నెలల్లోనే లక్ష మందికి ఉద్యోగం కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్ని శాఖల్లో ఎంత మంది అవసరం, ఎంత మంది ఉన్నారోనన్న సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కొన్ని శాఖలు, విభాగాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పని తక్కువైన నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.

విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఖాళీల వివరాలను, బ్యాక్‌లాగ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీల వివరాలు సీఎస్ తెప్పించుకుంటున్నారు. అన్ని శాఖలకు చెందిన పోస్టులు, ఖాళీలు, భర్తీ వివరాలన్నీ కూడా ఒకే చోట తెలిసేలా డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ అండ్‌ పర్సనల్‌ డాస్‌బోర్డ్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల రూపంలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఆన్‌లైన్‌లో నేరుగా చూసే అవకాశం ఉంటుంది.

Also Read : ఉగాది రోజున ఉద్యోగాల జాతర.. భర్తీకి క్యాలెండర్‌ విడుదలపై సీఎం జగన్‌ ఆదేశాలు..

Show comments