రాజుకుంటున్న ఎన్నికల వేడి- సత్తా చాటేదెవరు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల సందడి షురూ అవుతోంది. మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. స్థానిక పోరుకి సమయం ఆసన్నమైంది. అన్ని పార్టీలు అటు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి.

తల్లడిల్లుతున్న టీడీపీ

ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా పాలకపక్షం వైపు మొగ్గు కనిపిస్తుంటుంది. అయితే దానిని సద్వినియోగం చేసుకోవడంలో టీడీపీ విఫలం అయింది. సహకార సంఘాలకు కాలపరిమితి ముగిసిన అనంతరం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం కాలేక పోయింది. పంచాయితీ ఎన్నికల విషయం లో కూడా అదే తంతు. మున్సిపల్, కార్పొరేషన్ లలో పాలకవర్గాలు గడువు ముగిసినా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో జిల్లా మండల పరిషత్ సహా ప్రతీ ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు.

ప్రజల్లో వ్యతిరేకత గ్రహించి సాధారణ ఎన్నికల ముందు స్థానిక ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సిద్ధం కాలేక పోయారు. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పి తీసుకొస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పాలైన పార్టీలో శ్రేణులు నీరుగారిపోయాయి. కనీసం వారిని ఉత్సాహ పరిచే రీతిలో అధినేత తీరు లేకపోవడం మరింత కుంగదీసింది. ఇప్పుడు ఎన్నికల బరిలో దిగేందుకు అనేక మంది మొఖం చాటేసే ప్రమాదం దాపురించింది. ఆర్థిక భారం, అయోమయం ఆ పార్టీ నేతల వెనకడుగు వేస్తున్నాయి. అమరావతి అంశం, ఇంగ్లీష్ మీడియం విషయాల్లో ప్రజలకు పార్టీ బాగా దూరం అయినట్టు కింది స్థాయి నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఎదుర్కోవడం విపక్షానికి తలకు మించిన భారం కాబోతుందని టీడీపీ కార్యకర్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.


డైలమా లో జనసేన

అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఆశించి భంగపడ్డ జనసేన స్థానిక ఎన్నికల బరిలో ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు నుంచి స్పష్టత రాకపోవడం డైలమా కి కారణం అవుతోంది. తొలి ఎన్నికల్లోనే తల బొప్పి కట్టడంతో స్థానిక ఎన్నికల బరికి దూరంగా ఉండటం మంచిది అని కొందరు వాదిస్తున్నారు. కానీ సీనియర్ నేతలు మాత్రం పార్టీ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కూడా దూరంగా ఉంటున్న తరుణంలో అభాసుపాలు కావడం తప్ప, ఉపయోగం ఉండదనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ నిర్మాణం, తగిన నాయకత్వం లేని జనసేన పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. పరువు నిలుకుంటుందా అన్నది కూడా సందేహంగానే చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా వైసీపీ

అధికార పార్టీ, వరుస సంక్షేమ పథకాలు, విపక్షాల బలహీనతలే ఆయుధంగా వైసీపీలో ఉత్సాహం కనిపిస్తోంది. పలువురు క్షేత్రస్థాయి ఆశావహులు వైసీపీ నేతల చుట్టూ ప్రదిక్షణలు ప్రారంభించారు. సానుకూలతను సొమ్ము చేసుకోవాలని వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు దాటినా ఆ పార్టీకి తగిన నిర్మాణం లేదు. క్షేత్రస్థాయిలో మొన్నటి ఎన్నికల ముందు నియమించిన బూత్ కమిటీ లు కూడా పనిలో లేవు. ఈ ఎన్నికల సందర్భంగా ఆ లోటు పుడ్చుకోవాలని పాలక పక్షం ఆశిస్తోంది. అయితే మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ లో సానుకూలత ఏర్పడగా, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఎలా గట్టెక్కగలరో చూడాలి.

ఆరేళ్ల విరామం తర్వాత వచ్చిన స్థానిక సమరం ప్రస్తుతానికి అధికార పార్టీ అవకాశాలకు అడ్డు ఉండదనే అంచనాలున్నాయి. కానీ అసెంబ్లీ లో ప్రాతినిధ్యం లేని బీజేపీ, లెఫ్ట్ పార్టీలు సహా ఇతరుల ప్రభావం ఎలా ఉంటుంది, ఓటర్లు ఏ తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరమైన అంశం.

Show comments