Idream media
Idream media
రాష్ట్రంలో టిడిపి పరిస్థితి డెంగ్యూ పేషంట్ మాదిరిగా మారింది.. డెంగ్యూ రోగ తీవ్రత పెరిగేకొద్దీ రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక తెలుగు దేశం పరిస్థితి కూడా అలాగే ఉంది. చిల్లుకుండలోని నీళ్లు ఒక్కొబొట్టు కిందకు జారినట్లు అధికారం కోల్పోయిన నాటి నుంచి ఒక్కో నాయకుడూ పార్టీని వీడుతున్నాడు. దానికితోడు నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డప్పుకొట్టి మరీ టముకు వేసినట్లు టిడిపి వాళ్లంతా బీజేపీలోకి వచ్చేయండని పిలుపునిచ్చారు.
ఇప్పటికే పలువురు నాయకులు బీజేపీలో చేరగా మాజీ విప్, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె బాబూరావు కూడా బీజేపీలో చేరారు. గతంలోనే టిడిపికి రాజీనామా చేసిన గద్దె పార్టీ నాయకత్వం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తమలాంటివాళ్లకు పార్టీలో గుర్తింపు లేదని, ఆత్మాభిమానం ఉన్నవాళ్లకు అందులో స్థానం లేదని ఆవేదన చెందారు. ఎన్టీయార్ జమానాలో పార్టీలో ఉండే విలువలు, నైతికత , నిబద్ధత ఇప్పుడు కొరవడింది అని, ఇప్పుడంతా చెప్పుడు మాటలకు, పైరవీకార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. అయితే
వీర్రాజు పిలుపు టిడిపిని ఖచ్చితంగా ఒక కుదుపు కుదుపుతుందని అంటున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్నవాళ్లను, అక్రమాలకు పాల్పడిన వాళ్ళను రాష్ట్ర నిఘా సంస్థలు వేటాడుతున్నాయి. నాల్రోజులు లేటు అవుద్దేమోగాని చట్టానికి దొరికిపోవడం పక్కా.. అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. టిడిపిలో ఉంటే చట్టపరమైన రక్షణ దొరకదు. పార్టీ ముఖ్య నాయకులు లోకేష్, చంద్రబాబు హైద్రాబాద్ లో ఉంటూ తమ నాయకులు అరెస్ట్ అయ్యాక పరామర్శలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఇక్కడ పార్టీకి భరోసా లేదు.. తమకు పార్టీ నుంచి మద్దతు లేదు.. టిడిపి అధికారంలో ఉన్నన్నాళ్లు పలు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఎప్పుడు తమ మీద దర్యాప్తు జరుగుతుందో, ఎప్పుడు అరెస్ట్ అవుతామో అర్థంకాక భయంతో బిక్కజచ్చిపోతున్న టిడిపి తమ్ముళ్లకు ఇప్పుడు బిజెపి ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. మెల్లగా జాతీయ పార్టీలో చేరితే కాస్త ప్రశాంతంగా నిద్రపోవచ్చుననే భావనలో కొందరు లీడర్లున్నారు .
ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటున్న విషయాన్ని కింది క్యాడర్ ఆదర్శంగా తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు జిల్లాల వారీగా కొందరిని టార్గెట్ చేసి వారిని తమపార్టీలో చేర్చుకునే విషహయంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక గాని పక్కాగా అమలైతే జిల్లాల్లో టిడిపికి భారీగా గండి పడే ప్రమాదం ఉంది.